కరోనా నుంచి కోలుకున్న వారికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు చాలని అమెరికాలోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ చెప్తోంది. దాదాపు వెయ్యి మందిపై పరిశోధన చేసిన ఈ సంస్థ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కరోనా బారి నుంచి కోలుకున్న వారి శరీరంలో యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయని, అటువంటి వారికి వ్యాక్సిన్ తొలి డోసు ఇస్తే చాలని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నవారికి ఒక్క డోసు వ్యాక్సిన్ ఇవ్వగానే వారిలో రోగనిరోధక శక్తి చాలా మెరుగైనట్లు గుర్తించామని, కరోనా సోకని వారిలో రెండు డోసులు ఇచ్చినప్పటికీ వారిలో అంతగా మార్పులు రాలేదని వెల్లడించింది.
ప్రస్తుతం అన్ని దేశాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తోందని, కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసే ఇవ్వడం వల్ల దాదాపు 11 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ప్రపంచ వ్యాప్తంగా మిగులుతాయని తెలిపింది. సాధారణంగా వైరస్ నుంచి కోలుకున్న వారిలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయి కొన్నాళ్లకు తగ్గిపోతాయని, మళ్లీ వైరస్ శరీరంలోకి చేరగానే యాంటీబాడీలు క్రియాశీలకంగా మారి వైరస్ తో పోరాడుతుందని వెల్లడించారు. ఫిబ్రవరి నుంచే ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీలాంటి యురోపియన్ దేశాలు కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు రెండు డోసుల వ్యాక్సిన్‌లో కేవలం ఒక డోసే ఇస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో అయితే మొదట్లో ఇలాంటి వారికి అసలు వ్యాక్సిన్ అవసరం లేదనుకున్నా.. తర్వాత ఒక్క డోసు చాలని తేల్చింది