Tuesday, November 26, 2024

Big Story: ఆ పథకాలే బీఆర్‌ఎస్‌కు రాచబాట.. దేశమంతటా తెలంగాణ స్కీమ్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పథకాల పేర్లు మార్చి ప్రజలను ఏమార్చడంలో మోడీ సర్కార్‌ సరికొత్త రికార్డు సృష్టించిందని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, బ్యాంకింగ్‌ రంగం దివాళా, రూపాయి పతనంతోపాటు పాలనాపరమైన తప్పులపై దేశమంతటా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ స్థాపించిన బీఆర్‌ఎస్‌ అజెండా రూపకల్పన జరుగుతున్న కీలక సమయంలో కేంద్ర వైఫల్యాలు ఒక్కొక్కటిగా బైటపడుతున్నాయి. గత యూపీఏ సర్కార్‌ దేశంలో అమలులోకి తెచ్చిన పథకాలను, ఇతర రాష్ట్రాలు విప్లవాత్మకంగా అమలులోకి తెచ్చిన పథకాలను పేర్లు మార్చి పాపులిస్టిక్‌ పథకాలుగా కేంద్రం తిరిగి ప్రకటిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పథకాలకు పేర్లు మార్చి ప్రజలపై భారం పెంచడంలో బీజేపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తున్న ఇంటింటికీ మంచినీరు అందించే ”మిషన్‌ భగీరథ”ను జాతీయ ”జల్‌జీవన్‌ మిషన్‌”గా, ”రైతుబీమా” పథకాన్ని మరో రూపంలో, కొత్తగా గత మూడేళ్లుగా ”రైతుబంధు” పథకాన్ని ”కిసాన్‌ సమ్మాన్‌ యోజన” పేరుతో పేర్లు మార్చి కేంద్రం అమలు చేస్తోంది. ఇదే కోవలో అనేక పేర్లను మార్చి పథకాల స్వరూపాన్ని మార్చిందని, రానున్న జాతీయ పార్టీకి అనుకూలంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు.

గత పథకాలు మాయం…
2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎల్‌పీజీ సిలిండర్ల సబ్సిడీ పథకాన్ని పేరు మార్చిన మోడీ సర్కార్‌ పహల్‌ పథకంగా మార్చింది. అప్పటి నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకాన్ని ఇప్పుడు స్వచ్ఛ భారత్‌ మిషన్‌గా, 2013నాటి జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజనగా మార్పు చేశారని, 2011లో అప్పటి కేంద్ర పాలకులు తీసుకొచ్చిన జాతీయ మాన్యుఫాక్చరింగ్‌ పాలసీని మోడీ ప్రభుత్వం మేకిన్‌ ఇండియాగా పేరు మార్చారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 2010లో ఇందిరాగాంధీ మంత్రిత్వ సయోగ్‌ యోజన పథకాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి వందన యోజన పథకంగా మార్చి అమలు చేస్తున్నారు.

అదేవిధంగా 2010లో ఉన్న స్వావలంబన పథకాన్నే తిరిగి అటల్‌ పెన్షన్‌ యోజనగా మార్చారని, జాతీయ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంకు స్కిల్‌ ఇండియాగా మార్చడం జరిగిందని అంటున్నారు. 2010లో బీపీఎల్‌ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌లను అందించే పథకాలకు మార్పు చేసి పీఎం ఉజ్వల్‌ యోజనగా మార్పుులు చేశారు. అప్పటి జాతీయ పంటల బీమా పథకాన్ని పేరు మార్చి ఇప్పుడు బీజేపీ సర్కార్‌ ఫసల్‌ బీమా యోజనకు శ్రీకారం చుట్టింది. 2009లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుపేదల ఇండ్ల నిర్మాణాలకు అమలు చేసిన రాజీవ్‌ ఆవాస్‌ యోజనను సర్దార్‌ పటేల్‌ నేషనల్‌ మిషన్‌ ఫర్‌ అర్బన్‌ హౌసింగ్‌గా మార్చి అమలు చేస్తున్నారు. 2008లోని జాతీయ బాలికల దినోత్సవ పథకాన్ని భేటీ బచావో- భేటీ పడావోగా, 2008లోని భూసార పరీక్షల పథకాన్ని రూపుమాపి పీఎం భారతీయ జన ఔషధీ పరియోజనగా మార్చింది.

- Advertisement -

దేశంలో నీటిపారుదల రంగం అభివృద్ధికి, ప్రాజెక్టులు నిర్మించుకునే రాష్ట్రాలకు ఆర్థికంగా సహకరించేందుకు 2007లో తెచ్చిన ఇరిగేషన్‌ బెనిఫిట్‌ కార్యక్రమాన్ని పీఎం కృషి సంచాయ్‌ యోజనగా మార్చుతూ మోడీ సర్కార్‌ నిర్ణయించింది. 2007నాటి ఆమ్‌ఆద్మీ బీమా యోజనను పీఎం సురక్షా బీమా యోజనగా అమలు చేస్తున్నారు. 2006లో విప్లవాత్మకంగా తీసుకొచ్చిన నాటి నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌ ప్లాన్‌ను డిజిటల్‌ ఇండియాగా, నేషనల్‌ మారిటైం డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంను సాగర్‌ మాలా కార్యక్రమంగా మార్చారనే వాస్తవాలను విపక్షాలు చూపుతున్నాయి. ప్రణాళికా సంఘాన్ని నీతి ఆయోగ్‌గా మార్చిన విషయం కూడా తెలిసిందే.

గరీబ్‌ గాడీకీ తప్పలేదు…
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు 2005లో ప్రవేశపెట్టిన అజ్వికా నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌ను దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ యోజనగా, కరెంటులేని గ్రామాలకు విద్యుదీకరణకు గతంలో ఉన్న రాజీవ్‌గాంధీ గ్రామీణ్‌ విద్యుదీకరణ్‌ యోజనను దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనగా, 2005లోని జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యూవల్‌ మిషన్‌ను అమృత్‌ పథకంగా మార్చింది. అప్పటి బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఖాతాల పథకాన్ని జన్‌ధన్‌ యోజనగా మార్చుతూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ ఏరియాస్‌ పథకాన్ని ఇప్పుడు ఉదయ్‌ పథకంగా పేరు మార్చి అమలు చేస్తున్నారు.

పేదలకు ఉచిత టీకాలకు 1985లో ప్రవేశపెట్టిన యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాంను మిషన్‌ ఇంధ్రధనుస్‌గా, ఇందిరా ఆవాస్‌ యోజనను పీఎం గ్రామీణ ఆవాస్‌ యోజనగా మార్చారు. ప్రపంచ బ్యాంకు సైతం కితాబిచ్చిన ఐసీడీఎస్‌ పథకాన్ని పోషణ్‌ అభియాన్‌గా మార్చింది. దేశంలోని పేదలకు రవాణా సదుపాయంగా ఉన్న చౌక ప్రయాణమైన రైల్వేలోనూ ఇదే తీరు కొనసాగుతోంది. రైళ్ల పేర్లను మార్చివేసిన కేంద్రం టికెట్‌ ధరలను పెంచింది. ప్యాసింజర్‌ ట్రైన్లను సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ పేర్లను జోడించి ప్రజలపై టికెట్‌ భారం మోపిందని విపక్ష పార్టీలు చెబుతున్నాయి. ఈ పెరిగిన ఛార్జీలు ఈ నెల 1నుంచి అమలులోకి వచ్చి పేదలపై భారం పడుతోంది. సామాన్యుల లైఫ్‌లైన్లుగా పేరున్న ప్యాసింజర్‌ ట్రైన్లకే అక్టోబర్‌ 1 నుంచి జనవరి 31 వరకు పండగల సీజన్‌ పేరుతో ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరలను రెట్టింపు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement