ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ఉద్యమకారుల ఆత్మ త్యాగాల ఫలితంగా భారతదేశం ఇవ్వాల స్వేచ్ఛా దేశాల సమాఖ్యలోకి చేరింది. ఇది దేశ ప్రజలకు మాత్రమే కాదు.. మానవ స్వేచ్ఛను కోరుకునేవారందరికీ సంతోషకర సందర్భం. ఈ దేశం తన నాగరికత, బహుముఖ సంస్కృతితో ఉన్నంత కాలం తన వైభవాన్ని చాటుకుంటూనే ఉంటుంది.. వందల సంవత్సరాలుగా భారతమాతను చెరబట్టిన తెల్లదొరల పాలననుంచి దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛను పొందింది. అయితే.. అప్పట్లో తెల్లదొరల అణచివేతకింద మగ్గిపోయిన ప్రజలు.. ఇప్పుడు స్వదేశంలో అదే తరహా అణచివేతకు గురవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంగ్లిష్ పాలకులు మన సంపదను తరలించుకు వెళితే.. ఇప్పుడు ప్రజల ఆస్తులను ప్రైవేటుకు అప్పజెపుతూ పాలకులు అదే తరహా పాలన సాగిస్తున్నారనే అపవాదు వస్తోంది. అప్పట్లో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్రగా ఆంధ్రప్రభ అక్షరాలను సంధించి.. ప్రజల్లో చైతన్యం తెచ్చింది. అదే ఒరవడిని నేటికీ పాటిస్తోంది. స్వాంతంత్ర్యానికి సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితమే అంటే.. 1938, ఆగస్టు 15వ తేదీన ఆంధ్రప్రభ దినపత్రిక అవతరించడం ఓ చారిత్రక నేపథ్యంగానే భావించాలి. యాదృచ్ఛికమో, లేక మరేదైనా అనుకోవచ్చ.. కానీ, సరిగ్గా స్వాంతంత్ర్య దినోత్సవాన ఆంధ్రప్రభ తన వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం కూడా ఓ పండుగలానే భావించాలి.
– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
గ్రేట్ బ్రిటన్‌తో ఒప్పందం ద్వారా భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. చిత్తశుద్ధి, రాజనీతిజ్ఞత వంటి పూర్తి క్రెడిట్‌కు బ్రిటన్ అర్హమైనదనే అంటారు పెద్దలు. చరిత్ర ఉన్నంతకాలం ఇతర సామ్రాజ్య శక్తులకు ఈ పోరాటం అనేది ఓ ఉదాహరణగా నిలుస్తుంది. భారత ప్రజలు విముక్తి కోసం చేసిన పోరాట విధానం ప్రపంచ దృక్పథంలో ఎంతో మార్పు తెచ్చింది.. అయితే ఈ క్రమంలో అప్పట్లో ఉన్న కొద్దిపాటి పత్రికలు తమ వంతు పాత్రను చాలా చక్కగా నిర్వర్తించాయి. అటు పోరాటాల్లో అక్షర జెండాలుగా, ఇటు ప్రజల్లో నెలకొన్న అజ్ఞానాన్ని తొలగించే దివిటీలుగా మారాయి. అందులో ఆంధ్రప్రభ దినపత్రిక ఉండడమూ, ప్రజల గొంతుకగా నిలవడమూ నేటి తరం తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం.
బ్లాక్ అండ్ వైట్ ప్రింటే అయినా.. అప్పటి పత్రికల కోసం ప్రజలు ఎదురుచూసేవారు. అట్లా పంద్రాగస్టు నాటి వార్తలను, స్వాతంత్ర్యం సిద్ధించిన సంతోషకరమైన ముచ్చటను తెలియజేస్తూ ఆంధ్రప్రభ ప్రజల్లో సంతోషాన్ని నింపింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఏర్పాటులోనే తన అక్షరా ఒరవడి కొనసాగింది. అయితే అప్పుడున్న దినపత్రికలు చాలామటుకు ఇప్పుడు లేవు. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా చారిత్రక నేపథ్యం ఉన్న పత్రికల్లో నేటికీ కొనసాగుతూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నది ఒక్క ఆంధ్రప్రభ మాత్రమే. మిగతా పేపర్లన్నీ పుబ్బలో పుట్టి మఘలో మాయమైనట్టు మార్కెట్ శక్తుల ఒడిదుడుకులకు తట్టుకోలేక పోయినా, ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు వచ్చినా ఆంధ్రప్రభ నిర్విరామంగా ప్రజలకు చేరువ అవుతోంది. స్వాతంత్ర్య సిద్ధించిన రోజు ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ! దివ్యధాత్రి!! అనే ప్రధాన శీర్షికన వచ్చిన కథనం నేటికీ మరిచిపోలేనిది.
స్వాతంత్య్ర దినోత్సవ సంబురం జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో నాటి ఆంధ్రప్రభ దినపత్రిక క్లిప్పింగ్స్, వార్తా వీడియోలు ఇక్కడ ఇస్తున్నాం..