పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ పక్కా ప్లాన్ అని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. పిల్లల సహాయంతో టెన్త్ ప్రశ్నపత్రాలు బయటకు తీసుకొచ్చి, ప్లాన్ ప్రకారం వైరల్ చేస్తున్నారని వెల్లడించారు. బండి సంజయ్‌ను కోర్టులో హాజరు పరిచిన తర్వాత సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీ చేయాలని ముందుగానే మాట్లాడుకుని, మరుసటి రోజు ఆ ప్లాన్‌ని అమలు చేస్తున్నారు. శివాజీ అనే అబ్బాయి.. పేపర్లను బయటకు తీసుకువస్తున్నాడు. తెలుగు పరీక్ష రోజు కూడా బిట్ పేపర్‌ను బయటకు తీసుకువచ్చాడు. ఇక పేపర్‌ను ఫొటో తీసుకుని ప్రశాంత్‌కు ఇచ్చి వాట్సాప్‌లో వైరల్ చేయడం మొదలుపెట్టారు.
పిల్లల సహాయంతోనే పరీక్ష ప్రశ్నపత్రాలను బయటకు తీసుకొచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని సీపీ రంగనాథ్ చెప్పారు. అసలు కమలాపూర్ నుంచే ఎందుకు పేపర్లు బయటకు వచ్చాయనే అంశంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. కమలాపూర్ బాయ్స్ హైస్కూల్ ఏడు ఎకరాల్లోనే ఉంది అని సీపీ పేర్కొన్నారు. ఆ సెంటర్లో 250 పైన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ సెంటర్‌కు కాపలాగా ఒకరిద్దరు కానిస్టేబుల్స్‌ను మాత్రమే ఇవ్వగలుగుతాం. పిల్లల చెట్లు ఎక్కి స్కూల్ కంపౌండ్‌లోకి వచ్చారు. పోలీసులు వెళ్లిన వెంటనే పిల్లలు తిరిగి పారిపోయారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 166 సెంటర్లు ఉన్నాయి. 94 సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సెంటర్లకు ఇద్దరు కానిస్టేబుల్స్ చొప్పున కేటాయించినా కూడా 500 మంది పోలీసుల దాకా అవసరం పడుతారు. ఫ్లయింగ్ స్వ్కాడ్స్‌కు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి. మాకు ఇతర సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకరిద్దరి చొప్పున కేటాయించాం. నిన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా చెప్పాం.. మొత్తం పోలీసులే ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఇవ్వలేం.
ఇతర డిపార్ట్మెంట్ల సిబ్బందిని కూడా నియమించాలని చెప్పాం. అది రేపట్నుంచి ఇంప్లీమెంట్ అయ్యే అవకాశం ఉంది. పోలీసులు గేటు దగ్గర కాపలాగా ఉంటే.. ఆ పిల్లలు వెనుకాల ఉన్న కంపౌండ్ మీదుగా చెట్లపైకి ఎక్కి సెంటర్లోకి వచ్చి పేపర్ ఫోటో తీసుకుని వెళ్లారు అని వరంగల్ సీపీ తెలిపారు.