దేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాల సంస్కృతిని సుప్రీంకోర్టు ఇవ్వాల (శుక్రవారం) తప్పుపట్టింది. మతానికి తటస్థంగా ఉండాల్సిన దేశంలో ఇట్లాంటి సందేశాలు అంత మంచిది కాదని హెచ్చరించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్ “ఇది 21వ శతాబ్దం. అయితే మనం దేవుడిని దేనికి తగ్గించి మాట్లాడాలి? ఆర్టికల్ 51 మనకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని సూచిస్తోంది. మతం పేరుతో విద్వేషాలు రేపడం విషాదకరమైనది” అని పేర్కొంది.
ఇక.. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న వారిపై యూఏపీఏ (Unlawful Activities (Prevention) Act) కింద స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ద్వేషపూరిత ప్రసంగాలను “చాలా తీవ్రమైన సమస్య”గా పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం, ఫిర్యాదు దాఖలయ్యే దాకా వేచి ఉండకుండా దోషులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది.
పరిపాలన పక్షంలో ఎలాంటి జాప్యం జరిగినా దాన్ని కోర్టు ధిక్కారంగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను హెచ్చరించింది. షాహీన్ అబ్దుల్లా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, హృషికేష్ రాయ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల నోటీసులు జారీ చేసింది. మతంతో సంబంధం లేకుండా ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, దేశ సెక్యులర్ విధానాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.