కరోనా సెకండ్ వేవ్ తో దేశం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, మూడో దశ ఎప్పుడు,ఎలా వస్తుందో చెప్పలేమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు డాక్టర్ కే విజయ్ రాఘవన్ హెచ్చరించారు. థర్డ్ వేవ్ నాటికి కరోనా వైరస్ మరిన్ని మార్పులు చెందే అవకాశముందని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు మనమంతా సిద్దంగా ఉండాలన్నారు. ప్రపంచంతో పాటు భారత్ లో కూడా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి చెప్పారు. దేశంలో కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ తయారు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పని చేస్తున్నాయని తెలిపారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని తెలిపారు.
మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.5 లక్షల చొప్పున యాక్టివ్ కేసులు ఉండగా.. 12 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య.. మరో 17 రాష్ట్రాల్లో 50 వేల కంటే తక్కువ యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, బిహార్ రాష్ట్రాల్లో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుంది. రోజురోజుకూ 2.4 శాతం కొత్త కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. మూడోదశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1 తేదీ నుంచి తొమ్మిది రాష్ట్రాల్లో 6.71 లక్షల మంది 18-44 మధ్య వయసున్న వారికి టీకా వేశారు.