Friday, November 22, 2024

థర్డ్ వేవ్ ఎఫెక్ట్: తమిళనాడు సంచలన నిర్ణయం.. మళ్లీ లాక్ డౌన్..

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుచేయాలని నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ నుంచి ‘సండే లాక్‌డౌన్’ అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులతో పాటు పూర్తి మార్గదర్శకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

మంగళవారం (డిసెంబర్ 4) తమిళనాడులో 2,371 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,55,587కి చేరింది. మరో 9 మంది కరోనాతో చనిపోయారు.. రాష్టంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 36,085కి చేరింది. తమిళనాడులో ఇప్పటివరకూ 121 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ బారినపడినవారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల హోమ్ ఐసోలేషన్ తర్వాత ఆర్టీపీసీఆర్ కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. టెస్టుల్లో నెగటివ్‌గా తేలితే రెగ్యులర్ వర్క్స్‌ చేసుకోవచ్చునని… ఒకవేళ పాజిటివ్‌గా తేలితే మరికొద్దిరోజులు హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ‘థర్డ్ వేవ్’ ముప్పు పొంచి ఉందేమోనన్న ఆందోళన కలుగుతోంది.

ఇప్పటికే బిహార్, హర్యానా, మధ్యప్రదేశ్, అసోం.. తదితర రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ అమలుచేస్తున్నాయి. కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఆయా రాష్ట్రాల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి కుదించడంతో పాటు పెళ్లిళ్లు ఇతరత్రా శుభకార్యాలకు కేవలం 100 మంది మాత్రమే హాజరుకావాలనే నిబంధనలు అమలవుతున్నాయి. కేసుల సంఖ్య  ఇలాగే పెరిగితే మున్ముందు మరిన్ని రాష్ట్రాల్లో కఠిన చర్యలు తప్పకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement