భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన నేటితో సమాప్తం కానుంది. పూణె వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నేడు చివరి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో చెరొక మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు ఈ వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లు సాధించిన కోహ్లీ సేన వన్డే సిరీస్ కూడా గెలిచి ఇంగ్లీష్ టీమ్‌కు చివరి పంచ్ ఇవ్వాలని కోరుకుంటోంది. మూడో వన్డే పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఇదే సమయంలో సీమర్లకు కొంత స్వింగ్ కూడా లభిస్తుందని తెలుస్తోంది. నిలదొక్కుకుని ఆడితే భారీ స్కోరు సాధించడం సులభమేనని క్యూరేటర్లు అంటున్నారు. అయితే తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 350కి పైగా భారీ స్కోరు చేయాల్సి ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రెండో వన్డేలో భారీగా పరుగులు ఇచ్చి విఫలమైన కుల్ దీప్, కునాల్ స్థానంలో చాహల్, సుందర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 90 పరుగులు చేస్తే వన్డేల్లో ఆరు వేల పరుగులు చేసిన పదో భారత ఆటగాడిగా నిలుస్తాడు.