భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో మరో పోరు జరగనుంది. లీడ్స్ వేదికగా మూడో టెస్టు ఈ రోజు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. తొలి టెస్టులో చేతికి వచ్చిన విజయాన్ని వరుణుడు ఆపినా.. అత్యుత్తమ ఆటతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ ఆదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గత రెండు టెస్టుల్లో ఆధిపత్యం దృష్ట్యా కోహ్లి సేనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే జోరుతో మరో విజయంపై భారత్ కన్నేసింది. మూడో టెస్టు జరగనున్న లీడ్స్‌లో వాతావరణం పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున.. కోహ్లీసేన నలుగురు పేసర్లతోనే బరిలోకి దిగేలా కనబడుతోంది.
మరోవైపు టాప్ ఆర్డర్ వైఫల్యం, గాయాలు ఇంగ్లాండ్‌ను కలవరపెడుతున్నాయి. బౌలింగ్ పరంగా చూస్తే.. తన పేస్‌తో రెండో టెస్టులో భారత్ బ్యాట్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన మార్క్‌వుడ్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సాకిబ్ మహమ్మద్ అరంగేట్రం చేయనున్నాడు రెండో టెస్టులో చేసిన తప్పులను పునరావతం కానివ్వకుండా సమష్టిగా రాణించి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. కాగా, లీడ్స్ మైదానంలో 2002లో చివరి మ్యాచ్ ఆడిన భారత్.. ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్ 46 పరుగులతో ఘన విజయం సాధించింది.