Saturday, November 23, 2024

ట్రైన్ ఇంజిన్ నే ఎత్తుకుపోయిన దొంగ‌లు.. సొరంగం కూడా తవ్వార‌ట‌

దొంగ‌త‌నాలు అనేక ర‌కాలు. అయితే ఈ దొంగ‌లు ఏకంగా రైలు ఇంజిన్ నే కొట్టేశారు. రిపేర్ కోసం షెడ్ లో ఉంచిన రైలు ఇంజిన్ పై కన్నేసిన వారు.. ఎవరూ లేని సమయంలో ముక్కలుగా చేసి బస్తాల్లో తరలించారు. అందుకోసం ఏకంగా సొరంగాన్నే తవ్వేశారు. అయితే..అధికారులు మాత్రం మరో కథ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. బిహార్ లోని బెగుసరాయ్​జిల్లా గర్హరా రైల్వేయార్డ్​లో ఓ ట్రైన్ ఇంజిన్ ను అధికారులు రిపేర్ కోసం ఉంచారు. కొన్ని రోజుల క్రితం మరమ్మతులు చేసేందుకు అక్కడికి వచ్చిన వారికి జరిగిన సీన్ చూసి ఫ్యూజులు ఔట్ అయిపోయాయి.ఎందుకంటే అక్కడ ఇంజిన్ లేదు మరి. అసలు విషయం తెలుసుకుని నోరెళ్లబెట్టడం వారి వంతైంది. రైలు ఇంజిన్ పై కన్నేసిన దొంగలు కేవలం వారం రోజుల్లో ముక్కలు ముక్కలుగా చేసి ఎత్తుకుపోయారు.

ఇలా చివరకు ఇంజిన్​నే లేకుండా చేశారు. అంతే కాకుండా చోరీ చేసిన సరకును తీసుకువెళ్లేందుకు ప్రత్యేక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఇంజిన్ లోని భాగాలను ముక్కలుగా చేసుకున్న తర్వాత వాటిలోని రాగి తీగలు, అల్యూమినియం ప్లేట్​లను బస్తా్ల్లో నింపుకుని సొరంగం ద్వారా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని వివిధ జిల్లాలోని పాత ఇనుప దుకాణాల్లో అమ్మేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రైల్వే స్పెషల్ విజిలెన్స్ బృందం.. స్క్రాప్​ గోడౌన్​లపై దాడులు చేశారు. ట్రైన్​ఇంజిన్​కు సంబంధించిన కొన్ని భాగాలను గుర్తించి సీజ్ చేశారు. దొంగల ముఠా నాయకుడు చందన్​కుమార్​తో పాటు మరో ఇద్దరిని పట్టుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో ముజఫర్‌పుర్‌ జిల్లాలోని ఓ గోడౌన్​పై దాడి చేశారు. రూ.30 లక్షల విలువైన 13 బస్తాల విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో పాటు మరికొంత మంది ఈ దొంగతనాలకు పాల్పడతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంత జరిగినా.. ఇంజిన్ దొంగతనానికి గురవలేదని పోలీసులు, ఉన్నతాధికారులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement