Friday, November 22, 2024

వాళ్లు చేసింది క్ష‌మించ‌రాని నేరం, క‌ఠిన శిక్ష ప‌డాల్సిందే.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై అసద్ రియాక్షన్

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నహైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప‌బ్ గ్యాంగ్ రేప్ ఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం అత్యంత బాధాకరమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న అసద్.. నిందితులు క్ష‌మించ‌రాని నేరం చేశార‌ని, వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. అయితే.. ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఎంఐఎం నేతల పిల్లలే నిందితులుగా ఉన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే సోదరుడి కొడుకు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎమ్మెల్యే కొడుకు కూడా గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజులు అవుతున్నా.. అసదుద్దీన్ ఒవైసీ స్పందించలేదు. దేశంలో ఎక్కడా ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించే అసద్.. తన నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

కాగా, హైదరాబాద్ ఎంపీ మిస్సింగ్ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అసద్ స్పందించారు. తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నాలుగో నిందితుడిని కర్నాటకలోని గుల్బార్గాలో అరెస్ట్ చేశారు. నిందితులతో పాటు మైనర్ బాలిక కారులో కలిసి ప్రయాణించిన వీడియోలు, ఫొటోలు వైరల్ చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన మీడియా ప్రతినిధి సుభానీ.. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన వారంతా రాజకీయ నేతల పిల్లలే. వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడు, ఎంఐఎం నేత తనయుడు, సంగారెడ్డి టీఆర్ఎస్ నేత కుమారుడు అరెస్ట్ అయ్యారు. కాగా, తొలుత ఎమ్మెల్యే కొడుకు ఈ ఘ‌ట‌న‌లో లేడ‌ని చెప్పిన పోలీసులు మ‌రికొన్ని ఆధారాలు ల‌భించ‌డంతో కేసు పెట్టేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు . బెంజీ కారులో ఉన్న వీడియోలో ఎమ్మెల్యే కొడుకు ఉండటంతో లీగల్ ఒపినీయన్ తీసుకుంటున్నారు. అతనిని కేసులో ఆరో నిందితుడిగా చేర్చబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement