హైదరాబాద్ ఆంధ్రప్రభ: టెట్ సమాచార బులిటెన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. 2017లో నిర్వహించిన టెట్ సిలబస్ ప్రకారమే ఈ సారి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1కు ఫీజు రూ.300, పేపర్-2కు రూ.300 లేదా రెండు పేపర్లకు కలిపి రూ.300గా నిర్ణయించారు. శనివారం నుంచి ఏప్రిల్ 12 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 12న టెట్ పరీక్ష జరుగుతుంది. జూన్ 27న ఫలితాలు వెల్లడించనున్నారు. టెట్‌కు సంబంధించి మార్చి 26 నుంచి హెల్ప్ డెస్క్ సేవలు అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. జూన్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం విద్యార్థులకూ టెట్ రాసే అవకాశమివ్వడంతో సుమారు 30వేల మందికి లబ్ధిచేకూరనుంది. ఇదిలా ఉంటే తమ పోస్టులను తమకే కేటాయించాలని డీఈడీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్జీటీ పోస్టులను డీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని కోరుతున్నారు. ఎస్జీటీ పోస్టులను డిగ్రీ బీఈడీ చేసిన వారితో ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి న్యాయపోరాటానికి డీఈడీ అభ్యర్థులు సన్నద్ధమవుతున్నట్లు సమచారం.
2017 గత టీఆర్టీకి డీఎడ్ అభ్యర్థులు 5,415 ఎస్జీటీ పోస్టులకి దాదాపు 61వేల మంది పోటీ పడ్డారు. దాదాపు 2వేల ఎస్‌ఏ పోస్టులకు 2లక్షల మంది బీఎడ్ అభ్యర్థులు పోటీ పడ్డారు. త్వరలో వెలువడే టెట్, టీఆర్టీ లేదా డీఎస్సీకి 4 నుంచి 5 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడనున్నట్లు అంచనా. దాదాపు ఐదేళ్లుగా టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో కొత్తగా బీఎడ్, డీఎడ్ కోర్సులు చేసిన వారు లక్ష మంది, గత టెట్ పరీక్షల్లో అర్హత పొందని 2లక్షల మందితో పాటు గతంలో పాసై వెయిటేజీ కోసం రాసే మరో 2లక్షల మంది, చివరి సంవత్సరం చదువుతున్న వారూ పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా 5 లక్షల మంది ఇప్పుడు టెట్ రాయనున్నారు. పేపర్-1(ఎస్జీటీ)కి బీఈడీ వాళ్లకు అవకాశం ఇవ్వడంతో 4 నుంచి 5 లక్షల మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు కలిపి పోటీ పడనున్నారు. పేపర్-2(ఎస్‌ఏ)కి బీఎడ్ అభ్యర్థులు దాదాపు 3లక్షల మంది రాయనున్నారు.