టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చేసిన యత్నాలు.. ఆడియో టేపులలు.. స్పష్టమైన ఆధారాలున్నా ఇంకా బీజేపీ నేతలు తాము సుద్దపూసలమని చెప్పుకుంటున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అడ్డంగా దొరికిన దొంగలు కూడా తమను పోలీసులు ఎందుకు పట్టుకున్నారనే విధంగా ప్రశ్నిస్తున్నారన్నారు. ఇంకా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అంటూ సవాల్ చేయడాన్ని కూడా జగదీశ్‌రెడ్డి తప్పుపట్టారు. వాళ్లే దొంగలు.. పైగా తమను ఎందుకు పట్టుకున్నారనే రీతిలో తమను లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలనడం దీనికిందకే వస్తుందని సెటైరిటకల్ మాట్లాడారు.
బండి సంజయ్‌ని తాము ప్రమాణం చేయమన్నమా? ఎందుకంత గాబరా?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.100 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రలోభపెట్టినట్టు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రిలో తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఈ విషయమ్మీద మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. గుళ్లో ప్రమాణం చేయమని బండి సంజయ్ ని ఎవరడిగారని ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే బీజేపీ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు.
“మునుగోడు గడ్డపై అమిత్ షా చెప్పిన మాటలను నిజం చేసే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయ్యారు. బండి సంజయ్ ఇప్పుడు అమిత్ షాతో కూడా ప్రమాణం చేయిస్తారా?” అని మంత్రి జగదీశ్ రెడ్డి నిలదీశారు. బీజేపీ కుట్రలను తమ పార్టీ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని, దొంగలను విజయవంతంగా పట్టుకున్నారని వెల్లడించారు. బండి సంజయ్ బొక్కబోర్లాపడ్డారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో ప్రలోభాలపై వాస్తవాలు బయటికి వస్తున్నాయని, బీజేపీ నేతలు దోషులు అయ్యారని వివరించారు. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.