Monday, November 18, 2024

ఈ బండి నాకద్దుపో.. చలాన్లతో వేధిస్తున్నార‌ని.. నడిరోడ్డుపైనే బైక్ కు నిప్పు..

రూల్స్ అండ్ రెగ్యూలెష‌న్స్ క‌చ్చితంగా అమ‌లు చేయ‌డంలో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, కావాల‌ని చిన్న చిన్న విష‌యాల‌కు ఫొటోలు తీసి చ‌లాన్లు వేస్తుంటే.. చాలామంది వాహ‌న‌దారులు విసిగిపోతున్న మాట వాస్త‌వం. అయితే.. పోలీసులా.. వ‌సూళ్ల‌కు ఏజెంట్లా అన్న కామెంట్లు కూడా కొన్ని సంద‌ర్భాల్లో నెటిజ‌న్ల నుంచి వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసు ఉన్న‌తాధికారులు కూడా కాస్త ఆలోచించాల్సి ఉంది. తెలంగాణ‌లో ఫ్రెండ్లీ పోలిసింగ్ తో జ‌నాల‌కు ద‌గ్గ‌రైన వారే.. చిన్న చిన్న విష‌యాల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ దూరం చేసుకోవ‌ద్ద‌నే విజ్ఞాప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి..

అయితే.. ఒక పక్క పెట్రోల్‌ ధరలతో విసిగిపోయిన వాహ‌న‌దారుల‌కు మ‌రోవైపు.. ట్రాఫిక్ చ‌లాన్లు మ‌రింత ఇబ్బందిగా మారుతున్నాయి. బండిమీద‌ రోడ్డు ఎక్కామంటే చాలు.. ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కెమెరాకు చిక్కుతామోన‌ని చాలామంది హడలెత్తిపోతున్నారు. ఏ మూల‌నో న‌క్కి.. ఎక్కడ ఫోటో తీసి ఇ‌‌-చలాన్‌ పంపిస్తారేమోనని భయపడిపోతున్నారు. అయితే ఈ క్రమంలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి ట్రాఫిక్‌ పోలీసులకు షాక్ ఇచ్చాడు. ట్రాఫిక్‌ పోలీసుల తీరును నిరసిస్తూ త‌న బైక్‌కు నిప్పు పెట్టాడు.

ఆదిలాబాద్ టౌన్‌లోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్‌ అంబేద్క‌ర్ స‌ర్కిల్ సమీపంలోబైక్‌పై వెళ్తుండగా.. ట్రాఫిక్‌ పోలీసులు ఫొటో తీసి ఈ-చలాన్ కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూ ట్రాఫిక్ పోలీసులు ఇలా ఫోటోలు తీసి ఈ- చలాన్లు వేస్తున్నారని, నడిరోడ్డుపైనే తన బైక్‌కు నిప్పు పెట్టాడు. దీంతో రోడ్డుపై ఉన్నవారంతా విస్తుపోయారు. వెంటనే అక్కడున్నవారు, పోలీసులు వచ్చి మంటలను ఆర్పేశారు. అయినా అప్పటికే బైక్ డ్యామేజ్ అయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement