Monday, November 25, 2024

Big Story: గుండెపోటుకు ప్రధాన కారణాలు ఇవే.. బీ కేర్‌ఫుల్!

హార్ట్​ అటాక్​.. ఇది ఎంత డేంజరంటే.. ఉన్నట్టుండి మనుషుల్ని విగతజీవుల్ని చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్​ఏజ్​ లోనే హార్ట్​ అటాక్​తో  చనిపోతున్నారు. ఇవ్వాల ఉదయం (సోమవారం) ఆంధ్రప్రదేశ్​ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మాత్తుగా చనిపోయారు. కారణం గుండెపోటు (Heart Attack). మొన్నా మధ్య కూడా ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన ఆంధ్రప్రభ ప్రతినిధి కూడా యంగ్​ ఏజ్​లోనే గుండెపోటుతో చనిపాయారు.. ఇంతకీ గుండెపోటు ఎందుకు వస్తుంది.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

గతంతో పోల్చితే ప్రస్తుతం అధికంగా వస్తున్న జబ్బులలో గుండెపోటు ఒకటి. ఈ రోజుల్లో గుండెపోటు రావడం సర్వసాధారణం అయిపోయింది. పదేండ్ల క్రితం వరకు ఓల్డ్​ వారికి, ఉబకాయంతో బాధపడుతున్న వారిలోనే అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ, హెల్త్ టిప్స్ పాటించకపోవడంతో ఇప్పుడు యువకులు సైతం గుండెజబ్బులతో చనిపోతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తికి పలు కారణాల వల్ల గుండెపోటు వస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైన కారణాలు ఇవి..

ధూమపానం (సిగరెట్​, గంజాయి వంటివి తాగడం), పొగాకు ఉత్పతులను తీసుకోవడం వల్ల గుండెపోటు వస్తుంది. పొగతాగడం, పొగాకు వినియోగం గుండెపోటు ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. కాబట్టి పొగతాగే అలవాటును మానుకోవాలి.. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతేకాకుండా పొగాకు ఉత్పత్తులు తినవద్దు అని డాక్టర్లు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది హై బీపీతో బాధపడుతున్నారు. మీకు కనుక అధిక రక్తపోటు (High Blood Pressure) సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు గుండెను నియంత్రించే ధమనులను దెబ్బతీస్తుంది. అధిక కొవ్వు, స్థూలకాయం, డయాబెటిస్ లేక షుగర్ (Diabetes) వ్యాధి కారణంగా తరచుగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఇట్లాంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా గుండెపోటు వస్తుంది.

ఉబకాయం గుండెపోటుకు దారితీస్తుంది. స్థూలకాయం కారణంగా అధిక రక్తపోటు (High Blood Pressure), డయాబెటిస్ (Diabetes) సమస్యల బారిన పడుతుంటారు. వీటి కారణంగా తర్వాత వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్య గుండెపోటు. కనుక హార్ట్​ అటాక్​ సమస్యను నివారించాలంటే బరువు పెరగకుండా చూసుకోవడం కూడా ఒక మార్గమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

అంతేకాకుండా జన్యుపరమైన కారణాల వల్ల కూడా గుండెపోటు వస్తుంది. కొంతమందికి జన్యుపరమైన కారణాలు వల్ల గుండెజబ్బులు వస్తాయి. గతంలో కుటుంబ సభ్యులకు గుండెపోటు వచ్చిన వారు ఉన్నట్లయితే వారి సంతానం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు.

- Advertisement -

ఇకపోతే.. ఒత్తిడిని జయించకపోతే గుండెపోటు సమస్య బారిన పడతాం. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ మానసిక ఒత్తిడిని తీసుకునేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒత్తిడిని జయించాలంటే తరచుగా యోగా లేక వ్యాయామం చేయాల్సి ఉంటుంది. గుండెపోటుకు గల ప్రధాన కారణాలు తెలసుకున్నాం కాబట్టి ఇకమీదట వాటిని అదుపులో ఉంచుకునే మార్గాలను పాటించడం ద్వారా గుండెపోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement