ఏపీలో మూడు రాజధానులపై జగన్ సర్కార్ మళ్లీ ఫోకస్ చేసింది. ఇప్పటికే గ్రేటర్ విశాఖ పరిధిలోకి పలు మండలాలను చేర్చింది. ఇక కర్నూలులో కొత్త ఎయిర్ పోర్టును ప్రారంభించింది. ఇక మిగిలింది పరిపాలన రాజధానిని విశాఖకు తరలించడమే. మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ వేగంగా ముందుకు సాగుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. పరిపాలన రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తామని తేల్చి చెప్పారు.
రాష్ట్రాభివృద్ధికి ఉన్న అవకాశాలను చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాశనం చేశారని ఆరోపించారు. అమరావతిని ఓ వర్గానికి చెందిన రాజధానిగా మార్చి అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మూడు రాజధానులపై కోర్టుకు వెళ్లి, అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. మూడు రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని.. కోర్టులో చిన్నచిన్న సమస్యలున్నాయని.. కోర్టును ఒప్పించి, మెప్పిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
మరోవైపు పలువురు ఉన్నతాధికారులు కూడా ఇటీవలే విశాఖలో పర్యటించి వచ్చారని, వివిధ శాఖల తరలింపు శరవేగంగా జరుగుతుందని సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి కోసమే విశాఖకు పరిపాలనా రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినా, ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గతేడాది కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా మరికొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నీకలిపి హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. అయితే విచారణ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణ నిలిచిపోయింది. జనవరిలో నిలిచిపోయిన ఈ విచారణను హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి మార్చి 26న తిరిగి ప్రారంభించారు. మూడు రాజధానుల పిటిషన్లు, సీఆర్డీయే రద్దు ను సవాల్ చేసిన పిటిషన్లపై కొత్త సీజే మే నుండి రెగ్యూలర్ గా విచారణ చేస్తామని ఇటీవలే ప్రకటించారు.