హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికే కోర్సులను అందుబాటులోకి తేవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, పీజీ పట్టాలు పట్టుకుని కోటి ఆశలతో బయటికి వెళ్తున్నారని, కానీ వారు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారని చెప్పారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్, టీఎస్ ఆన్‌లైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు అగ్మెంట్ ఎంప్లాయిబిలిటీ సదస్సు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కొన్ని కాలేజీల్లో మాత్రమే చేరేందుకు విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, మిగతా కాలేజీల్లో ఆ పరిస్థితి ఎందుకు లేదో సమీక్షించాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులు పోటీ పడి చేరే రోజులు రావాలని, ఆ దిశగా కొత్త కోర్సులను అందుబాటులోకి తేవాలన్నారు. ఎంత చదివినా అంతిమంగా ఉద్యోగం సాధించేలా కోర్సులుండాలన్నదే తమ అభిమతమన్నారు. అన్ని రంగాల్లో ముందున్నట్లుగానే తెలంగాణలో విద్యారంగంలో సైతం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంలో రాష్ట్రం ముందుందని అన్నారు.
ఎనిమిదేండ్లలో 17వేలకు పైగా పరిశ్రమలు రాగా, 15 లక్షల ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. కొత్తగా 1500కు పైగా ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని, వాటిద్వారా ఏడు లక్షల ఉద్యోగాలు పొందారన్నారు. ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులను అందుబాటులోకి తేవాలన్నారు. పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానం చేసే విధంగా కరిక్యులం రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఉపాధిలభించే మరిన్ని కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. బీఏ ఆనర్స్, బీఎస్సీ బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీ డాటా సైన్స్ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మనదగ్గర ఉన్న కరిక్యులం గత 20 ఏళ్ల క్రితం నాటనాటిదని, దీనిని పూర్తిగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. టీహబ్, వీహబ్ తరహా సెంటర్లను విద్యాసంస్థల్లోను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, పలు వర్సీటీల వీసీలు రవీందర్, కట్టా నర్సింహారెడ్డి, రవీందర్ గుప్తా, గోపాల్‌రెడ్డి, లక్ష్మీకాంత్ రాథోడ్, మల్లేశ్, టీసీఎస్ కంట్రీ మార్కెట్ హెడ్ గోపాలకృష్ణ పాల్గొన్నారు.