బీజేపీలో మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తూ పార్టీ నేత, నటి గాయత్రి రఘురాం ప్రాథమిక సభ్యత్వానికి ఇవ్వాల (మంగళవారం) రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నామలై నవంబర్ 23న గాయత్రిని ఆరునెలల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా, బీజేపీ ఓవర్సీస్ తమిళ్ డెవలప్‌మెంట్ యూనిట్ చీఫ్‌గా గాయత్రి వ్యవహరించారు. మహిళలకు సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం కల్పించనందున భారమైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
అన్నామలై నాయకత్వంలో మహిళలకు భద్రత లేదని, పార్టీలో ఉండటం కంటే బయటనుంచి ట్రోలింగ్‌కు గురికావడం మెరుగనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను ట్యాగ్ చేస్తూ గాయత్రి ట్వీట్ చేశారు.
గాయత్రిని సస్పెండ్ చేసేందుకు కొద్దిరోజుల ముందు సీఎం ఎంకే స్టాలిన్ కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఆమె కలిశారని బీజేపీ క్రీడలు, నైపుణ్యాభివృద్ధి విభాగం ప్రెసిడెంట్ అమర్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. బీజేపీలో ద్రోహులకు స్ధానం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే తాను ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నానని, అక్కడికి ఎవరెవరిని ఆహ్వానించారో తనకు తెలియదని ఈ సందర్భంగా గాయత్రి వివరణ కూడా ఇచ్చారు.