Monday, November 18, 2024

లఖింపూర్ ఖేరి వెళ్లి తీరుతా: రాహుల్

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో లఖింపూర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించాలని నిర్ణయించగా.. ఆయన పర్యటనకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ప్ర‌స్తుతం నియంత పాల‌న న‌డుస్తోంద‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.   ప్ర‌భుత్వాలు రైతుల హ‌క్కుల్ని కాల‌రాస్తున్నాయ‌ని అన్నారు. ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.  

నూతన సాగు చట్టాలను తీసుకొచ్చి రైతుల వెన్ను విరిచిందని ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న రైతులపై, వారికి మద్దతుగా నిలిచిన విపక్షాలపై మోదీ సర్కారు నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను కలవడానికి వీల్లేదని యూపీ పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ, తాను లఖీంపూర్ వెళతానని స్పష్టం చేశారు. హ‌థ్రాస్ అత్యాచార ఘ‌ట‌న‌లో యూపీ స‌ర్కార్ ఇలానే వ్య‌వ‌హ‌రించింద‌ని రాహుల్ గుర్తు చేశారు. రైతులపై హత్యలకు పాల్పడుతున్నారని, లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి ఆయన కుమారుడి పేరు వస్తున్నా వారిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. లక్నోలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ కనీసం లఖింపూర్ కి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించలేదని రాహుల్ మండిపడ్డారు.

మరోవైపు లఖీంపూర్ హింసలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లే క్రమంలో సీతాపూర్ లో అరెస్టయిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గడిచిన రెండు రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. అనుమతి లభించేదాకా తాను సత్యాగ్రహం కొనసాగిస్తానని ప్రియాంక తెలిపారు.

కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆషిష్ కారుతో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రికత పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనకు కారణమైన ఆషిష్ మిశ్రాపై పోలీసులు హత్యకేసు నమోదు చేసినా.. అతన్ని అరెస్టు చేయకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో బతుకమ్మ సందడి

- Advertisement -

 

Advertisement

తాజా వార్తలు

Advertisement