కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో తమకు ఊరట కల్పిస్తారని, ఉపశమన చర్యలు ఉంటాయని ఆయా రంగాలు మొదలుకొని దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. గత రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ తరుణంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి భారీ తాయిలాలు ప్రకటిస్తుందని అంచనాలు ఉన్నాయి. రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
మరోవైపు ఉద్యోగులు స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని కోరుతున్నారు. అలాగే 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా కారణంగా మారిన పరిస్థితులు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు. రైతులు కూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద అందించే ప్రయోజనాన్ని పెంచాలని కోరుకుంటున్నారు. అలాగే మధ్యతరగతి ప్రజలు ఆదాయపు పన్ను స్లాబులను సవరించాలని ఆశిస్తున్నారు.