Tuesday, November 26, 2024

అన్నదాతల ఆగ్రహం, వ‌డ్ల‌ రాశికి నిప్పు.. కాంటాలు ధ్వంసం, కొనుగోళ్ల నిలుపుదల

ఉమ్మడి నల్గొండ, ప్రభన్యూస్‌ బ్యూరో: వానాకాలం వరిపంట సాగుచేశారు.. పంట చేతికొచ్చే సమయంలో చీడపీడల తాకిడికి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది.. దీనికితోడు రేటు- కూడా లేకపోవడంతో అన్నదాత అవస్థలు పడ్డారు. అయినా అప్పోసప్పో చేసి ఆరుగాలం శ్రమించి యాసంగిలో వరిపంట సాగుచేశారు. ఈసారి రైతు శ్రమకు కొంత ఫలితం దక్కి దిగుబడులు పెరిగాయి. కానీ ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ధాన్యం అమ్ముకునే సమయంలో అన్నదాతకు కష్టాలు తప్పడంలేదు. సన్నరకం వడ్లు చింట్లు-, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, బీపీటీ సాగు చేశారు. సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టు-తోపాటు- మూసీ, ఏఎంఆర్పీ పరిధిలో సుమారు 10లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంట్లో 8లక్షల ఎకరాల వరకు సన్నాలే సాగుచేశారు. అయితే వడ్లు మార్కెట్‌లోకి వచ్చే తొలిరోజుల్లో సన్నరకం ధాన్యం మిల్లర్లు, వ్యాపారులు క్వింటా రూ.2200ల ధర పలికింది. రానురాను మార్కెట్‌లోకి ధాన్యం ఇబ్బడిముబ్బడిగా వస్తుండటంతో దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారు. రోజురోజుకు ధరను గణనీయంగా తగ్గిస్తున్నారు.

క్వింటా రూ.1700ల లోపే గరిష్టధర నిర్ణయిస్తున్నారు. అన్నదాతల శ్రమను నిలువునా దోచుకుంటు-న్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, కోదాడ, హాలియా, తిరుమలగిరి ప్రాంతాల్లో ధరను భారీగా తగ్గించేశారు. ప్రతిరోజూ ట్రాక్టర్‌లలో ధాన్యం తీసుకొని వస్తుండటం.. రోజుకు వేల ట్రాక్టర్లలో వస్తుండటంతో వ్యాపారులు, మిల్లర్లు ఒక్క-టై రేటు- తగ్గించారు. అయినా రైతు మాత్రం వచ్చిన ధరకే అమ్ముకుంటు-న్నారు. కానీ రోజురోజుకు వడ్ల ధర తగ్గుతుండటం.. శనివారం ఒక్కసారే క్వింటాకు 500రూపాయలకు పైగా తగ్గించారు. క్వింటా 1250రూపాయల నుండి 1500రూపాయలే ధర పెట్టారు. దీంతో రైతులు ఆగ్రహించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అన్నదాతలు కాంటాలను ధ్వంసం చేశారు. ధాన్యం రాసికి నిప్పంటించి ఆందోళన చేశారు. రైతుల నిరసన తీవ్రం కావడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. రైతులు పండించిన ధాన్యం క్వింటా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందేనని తీర్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement