మహబూబాబాద్, ప్రభన్యూస్: 1825, సెప్టెంబర్ 27వ తేది.. ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌లోని స్టాక్‌టన్ ఆన్‌టీస్ నుంచి డార్లింగ్టన్ మధ్య తొలి ప్యాసింజర్ రైలు నడిచింది ఈ రోజునే. ఈ రెండు పట్టణాల మధ్య 12.9 కిలోమీటర్ల మేర రైల్వేలైను నిర్మించాలని స్టాక్‌టన్, డార్లింగ్టన్ రైల్వే యోచిస్తున్న విషయం తెలిసిన వెంటనే అప్పటివరకూ కిల్లింగ్‌వర్త్ కాలరీలో పనిచేస్తున్న జార్జ్ స్టీఫెన్‌సన్.. ఈ కంపెనీ అధినేత ఎడ్వర్డ్‌ను కలిశాడు. వాస్తవానికి ఈ రైల్వేలైన్‌లో వ్యాగన్లను గుర్రాలతో లాగించాలని ఎడ్వర్డ్ భావించాడు.
అయితే, వాటికి బదులుగా స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తే.. అంతకు 50 రెట్లు బరువును అది లాగగలదంటూ తన ప్రణాళికను వివరించాడు జార్జ్ స్టీఫెన్‌సన్. దీంతో ఎడ్వర్డ్ ఈ రైల్వేలైన్ మొత్తం బాధ్యతను జార్జ్‌కు అప్పగించాడు. సెప్టెంబర్ 27వ తేదీన 450 మంది మనుషులు, కొన్ని వందల కిలోల సరుకుతో ఈ రైలు బయల్దేరింది. గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ సమయంలో రైలింజన్‌ను నడిపింది జార్జ్ స్టీఫెన్‌సన్నే. ఇదిలా ఉండగా భారతదేశంలో తొలి ప్యాసింజర్ రైలు 1853లో ప్రారంభమై బాంబే నుంచి థానే వరకు నడిచింది.