వాజేడు (ప్రభ న్యూస్): ములుగు జిల్లా బోర్డర్‌లో ఉన్న అటవీ ప్రాంత గ్రామాల్లో ఇప్పటికీ సరైన వైద్య సదుపాయాలు లేవు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఊళ్లన్నీ నీట మునిగాయి. అయితే.. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి తరలించడంలో అక్కడి తహసీల్దార్ హెల్ప్ చేశారు. అటవీప్రాంత మండలమైన వాజేడులో ఈ ఘటన జరిగింది. అయితే ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలోనే 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బాధిత మహిళను ఆస్పత్రికి చేర్చడంపై వారి కుటుంబ సభ్యులతోపాటు మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఉన్న అట్టం రజితకు ఇవ్వాల సాయంత్రం (శనివారం) పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే అక్కడి నుంచి హాస్పిటల్‌కు ఎట్లా తీసుకెళ్లాలో కుటుంబ సభ్యులకు తెలియక కంగారుపడ్డారు. ఈ విషయాన్ని తహసీల్దార్ లక్ష్మణ్‌కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించారు. దీంతో నిండు గర్భిణి అయిన రజితను పడవ సాయంతో గోదావరి వరద నీటిలోనే సుమారు 10 కిలో మీటర్లు ప్రయాణం చేసి వాజేడు ఆస్పత్రికి సురక్షితంగా చేర్చారు. ఆస్పత్రికి చేరుకున్న ఆ మహిళకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి డాక్టర్లను తహసీల్దార్ కోరారు.