మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. చివరకు భర్తను ఇంటికి పిలిచి ప్రియుడు, మరో ఇద్దరి హెల్ప్ తీసుకుని లేపేసింది. హైదరాబాద్ నగరంలో ఈనెల 19న అర్ధరాత్రి జరిగిన డెయిరీ వ్యాపారి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో మృతుడి భార్య సహా అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పహడీషరీఫ్ పోలీసులు తెలిపారు. భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ కేసు వివరాలు వెల్లడించారు. హత్యకేసులో మృతుడి భార్య, ఆమె ప్రియుడితో పాటు హత్యకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్ ఆదిల్ అలియాస్ నరేష్ (35) స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్ మోయిన్‌బాగ్‌లో నివాసం ఉంటోంది. అయితే.. అదే ప్రాంతంలో ఉండే సయ్యద్ ఫరీద్ అలీ అలియాస్ సోహైల్ (27) తో ఆమె ఇల్లీగల్ కాంటాక్ట్ కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి భర్త.. షేక్ ఆదిల్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఈ విషయాన్ని జోయా బేగం ప్రియుడు ఫరీద్ అలీకి చెప్పింది.
ఎలాగైనా ఆదిల్‌ను చంపాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. ఈ మేరకు ఫరీద్ అలీ తన స్నేహితులు ముహమ్మద్ రియాజ్, షేక్ మావియా, మహ్మద్ జహీర్‌ల సహకారం తీసుకున్నాడు. అనుకున్న విధంగానే వారిని తీసుకోని ఈ నెల 19 న రాత్రి జోయాబేగం ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆదిల్ ఇంట్లో నిద్రపోతుండగా.. నలుగురు కలిసి అతని మెడకు చున్నీతో ఉరి బిగించి, కత్తితో పొడిచి హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని ఆటోలో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి రోడ్డుకు తరలించి.. పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారించారు. ఐదుగురిని అరెస్టు శనివారం రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.