మూడవ ప్రపంచ యుద్ధం చేపట్టాలన్న ఆసక్తి తమకు లేదని అమెరికా స్పష్టంచేసింది. ఈ మేరకు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఓ ప్రకటన చేశారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ, నో ఫ్లై జోన్ విధించడం అంటే దాన్ని అమలు చేయడమే అని, అంటే రష్యా విమానాలను షూట్ చేయడమని, నాటో దళాలు కూడా రష్యా విమానాలను పేల్చాల్సి వస్తుందని, మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆరంభించడం తమకు ఇష్టంలేదని జెన్ తెలిపారు.
ఒకవేళ నో ఫ్లై జోన్ విధిస్తే అప్పుడు రష్యాతో యుద్ధం మరింత విస్తృతంగా మారుతుందని వైట్‌హౌజ్ అభిప్రాయపడింది. జెలెన్‌స్కీ ఇచ్చిన ప్రసంగాన్ని బైడెన్ తన నివాసం నుంచి ప్రత్యక్షంగా చూశారని, ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం చాలా ఆవేశపూరితంగా, శక్తివంతంగా ఉందన్న అభిప్రాయం కలిగిందని, కానీ జాతీయ భద్రతా దృష్ట్యా.. తమ ప్రభుత్వం నో ఫ్లై జోన్ పై నిర్ణయం తీసుకోవడంలేదని అన్నారు.