ప్రధాని నరేంద్రమోదీ గత నెల ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. రెండు రోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది. గురువారం బర్రెల మందను ఢీకొట్టగా, ఇవ్వాల ఆవును ఢీకొట్టింది. ఇవ్వాల సాయంత్రం గాంధీనగర్-ముంబై మార్గంలో అవును ఢీకొట్టడంతో రైలు ముందు భాగానికి సొట్టపడింది. ఈ ఘటన కారణంగా 10 నిమిషాలు ఆగిపోయి తిరిగి బయలుదేరింది.
గురువారం కూడా కొత్తగా ప్రారంభమైన సెమీ హైస్పీడ్ రైలు నాలుగు బర్రెలతో కూడిన మందను ఢీకొట్టింది. రైలు ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా ఉదయం అహ్మదాబాద్ సమీపంలో బెట్వా-మనీనగర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. దీంతో రైలు ముందు భాగం భారీగా దెబ్బతింది. ఈ రెండు ఘటనలు రైలు మెటీరియల్‌లో నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
బర్రెలు, ఆవులను ఢీకొన్నా రైలు ముందు భాగం దెబ్బతినడంతో.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైలు ఇంత బలహీనమా అనే విమర్శలు వస్తున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం రైలు నాణ్యతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెబుతున్నది. డ్యామేజీ అయినా తిరిగి కొత్త భాగాన్ని అమర్చేలా రైలు ముందు భాగాన్ని ఫైబర్‌తో డిజైన్ చేశారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇంతకు ముందు ట్రయల్ రన్ జరుగుతున్నప్పుడు కూడా ఈ రైలుపై అల్లరి మూకలు రాళ్లదాడి చేశారు. దీంతో రైలు అద్దాలు పగిలిపోయిన ఘటనలు కూడా జరిగాయి.