Friday, October 18, 2024

The True Lover – మ‌రిచిపో.. నేస్త‌మా! వ‌ల‌చినా వ‌రించ‌క‌పోతిని

ప్రేయ‌సి ఆలోచ‌న‌ల్లోనే ముగిసిన జీవితం
మ‌రో అమ్మాయిని ఊహించుకోని టాటా
ఆమెపై ప్రేమతో జీవితాంతం బ్రహ్మచారిగా
రతన్ టాటాది గ్రేట్​ లవ్ స్టోరీ
ఇండియాపై మ‌మ‌కారంతో.. త‌న ప్రేమ‌ను చంపేసుకున్నారు

అది.. 1937 డిసెంబర్ 28వ తేదీ.. ముంబయిలోని ఓ సంపన్న కుటుంబంలో రతన్ నావల్ టాటా జన్మించారు. అయితే.. పదేళ్ల వయసులోనే ఆయన తల్లి, తండ్రి విడిపోవటంతో చిన్నారి రతన్ టాటా అత‌ని తమ్ముడు జిమ్మీని నాయనమ్మ నవాజ్ బాయి టాటా పెంచి పెద్దచేశారు. దీంతో రతన్ బాల్యమంతా తన బామ్మ దగ్గరే గడిపారు. ముంబయి, సిమ్లాలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆపై విదేశాలకు పయనమయ్యారు. ఆ త‌ర్వాత అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో స్ట్రక్చరల్ డిజైనింగ్ ప్రధానాంశంగా ‘బీఆర్క్’ కోర్స్​ను ర‌త‌న్ టాటా కంప్లీట్ చేశారు.

ప్రేమ చిగిరించింది అక్క‌డే..

- Advertisement -

గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక టాటాకు లాస్ ​ఏంజిల్స్‌లోని జోన్స్ అండ్ ఎమ్మోన్స్ (Jones and Emmons) ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆయన సుమారు రెండేళ్ల పాటు పనిచేశారు. అప్పుడే ఆయనకు ఐబీఎంలో ఆఫర్​ వచ్చింది. అంతలోనే స్వదేశం నుంచి హఠాత్తుగా ఓ కబురు వచ్చింది. అది ర‌త‌న్‌ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అన్నీ తానై పెంచిన నాయనమ్మ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో రతన్ ఉన్నపళంగా ఇండియా వచ్చేయాల‌ని ఆమె నుంచి పిలుపు వచ్చింది. తమ సొంత వ్యాపారంలో టాటాలకు అండగా ఉండాల‌ని నాయ‌న‌మ్మ న‌వాజ్ బాయీ.. రతన్ టాటాను కోరారు.

యుద్ధ స‌మ‌యం, అమ్మాయిని పంప‌బోం..

తను పనిచేసే సంస్థలోనే సహ ఉద్యోగి అయిన ఓ అమెరికన్ యువతిని అప్ప‌టికే ర‌త‌న్ టాటా ప్రేమించారు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రణయంగా మారింది. పెళ్లి చేసుకొని ఓ కొత్త లైఫ్​ను స్టార్ట్ చేద్దామని కలలు కంటున్న వేళ.. కలవరపరిచే ఘటనలు ఆయన్ను చుట్టుముట్టాయి. దీంతో తనతో పాటు ఇండియా వచ్చేయాలని ప్రేయసిని కోరారు. కానీ, దానికి ఆ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పుడు ఇండో చైనా యుద్ధం నడుస్తున్నందున ఇటువంటి పరిస్థితుల్లో తమ కుమార్తెను ఇండియాకు పంపబోమని వారు తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలోనే ర‌త‌న్ టాటా త‌న ప్రేమ‌ను సైతం త్యాగం చేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

మాతృదేశంపై మ‌మ‌కారం..

ఓ వైపు ఇండియా వచ్చేయాలన్న నాయనమ్మ కోరికను మన్నించాలా? లేకుంటే తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి అమెరికాలోనే ఉండిపోవాలా? అనే ప్రశ్నలు రతన్ టాటాను సందిగ్ధంలో నెట్టేశాయి. కానీ, మాతృదేశం మీద ఆయనకున్న మమకారం, నాయనమ్మ అనురాగం ఆయన్ని తిరిగి సొంత దేశానికి వచ్చేలా చేశాయి. అలా.. 1962లో రతన్ టాటా భారత్​కు తిరిగి వచ్చారు. నాయనమ్మ పిలుపే రతన్ టాటా జీవితానికి మలుపైంది. కానీ, ఒక్కరినే ప్రేమించి వారినే పెళ్లాడలన్న తన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్న ఆయన తన ప్రేయసి స్మృతులతో అలాగే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. ర‌త‌న్ టాటా మ‌ర‌ణంతో ఆయ‌న ప్రేమ ప్ర‌యాణాన్ని అంతా కొనియాడుతున్నారు. నేటి స‌మాజంలో ఉన్న యువ‌త ర‌త‌న్ టాటాని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని చాలామంది నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. ర‌త‌న్ టాటా మృతికి సంతాపం తెలియ‌జేస్తూ.. ఆయ‌న స్మృతుల‌ను యాది చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement