Friday, November 22, 2024

న‌కిలీ సీడ్స్‌ అంట‌గ‌ట్టిన వ్యాపారి.. పోలీసుల‌కు అడ్డంగా బుక్క‌యాడు

బాల్కొండ, (ప్రభన్యూస్): రైతులకు నకిలీ విత్తనాలు అంట‌గ‌ట్టిన‌ సీడ్స్ వ్యాపారిని పోలీసులు అరెస్టుచేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యమద్రి భాస్కర్ ను సోమవారం పెర్కిట్ లో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కర్తన్ చంద్రమోహన్ తో కలిసి విలేకరుల సమావేశం లో ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన వ్యాపారి యమాద్రి భాస్కర్ తక్కువ సమయంలో ఎక్కువ డ‌బ్బు సంపాదించాలని ఆశతో నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతులను నట్టేట ముంచాడు. కొంత కాలంగా భాస్కర్ ఆర్మూర్, నందిపేట్, బాల్కొండ మండలాల్లో రైతులకు ఎర్రజొన్న, ముళ్ల‌ జొన్న విత్తనాలను సరఫరా చేశాడు. వచ్చిన దిగుబడిని కొనుగోలు చేశాడు.

కానీ, తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బును సంపాదించాలని ఆశతో రైతులకు నకిలీ విత్తనాలను తక్కువ ధరకు తీసుకొచ్చి సరఫరా చేశాడు. బాల్కొండ మండలం ఇత్వర్ పెట్ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. రైతులను మోసం చేయడంతో పాటు డబ్బులు అడిగినందుకు తమ దగ్గర పెద్ద పెద్ద మనుషులు ఉన్నారని రైతులను బెదిరించాడని అన్నారు. దీంతో ఆయనపై 3 కేసులు (420, 19, 21 క్లాస్ వన్) సీడ్స్ యక్టు నమోదు చేసి, ఆయన వినియోగిస్తున్న రెండు కార్లను సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు. భాస్కర్ వల్ల మోసపోయిన రైతులు ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత పోలీసులను సంప్రదించాలని రైతులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement