Thursday, October 31, 2024

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌ ర‌గ‌డ.. ఆల‌యంపై పెట్రోల్ బాంబులు విసిరిన దుండ‌గులు!

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ లీడ‌ర్ల‌ అనుచిత వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి. జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో హింసాత్మ‌క నిర‌స‌న‌ల త‌ర్వాత శుక్ర‌వారం అర్ధ‌రాత్రి కొంద‌రు దుండ‌గులు ఆల‌యంపై పెట్రోల్ బాంబులు విసిరారు. సూర్య మందిర్ ఆల‌యం లోప‌లికి 4 పెట్రోల్ బాంబులు విసిరిన స‌మ‌యంలో ఆల‌య ప్రాంగ‌ణంలో పూజారి త‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు నిద్రిస్తున్నారు. ఆల‌యంలో పెట్రోల్ బాంబులు విస‌ర‌డంతో పూజారి కుటుంబ స‌భ్యులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

రాత్రి నుంచి త‌మ‌కు నిద్ర క‌ర‌వైంద‌ని సూర్య‌మందిర్ ఆల‌య పూజారి చెప్పారు. కాగా, దోషుల‌ను ప‌ట్టుకునేందుకు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని పోలీసులు తెలిపారు. మ‌రోవైపు బీజేపీ లీడ‌ర్ నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై రాంచీ న‌గ‌రంలో ఆందోళ‌న‌కారులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. నూపుర్ శ‌ర్మ‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శంచారు. ప‌రిస్ధితిని అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయ‌డంతో నిర‌స‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. అల్ల‌రి మూక‌ను చెద‌ర‌గొట్ట‌డానికి గాలిలోకి కాల్పులు కూడా జ‌ర‌పాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో గాయ‌ప‌డిన వారిని రిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. క్ష‌త‌గాత్రుల్లో ఇద్ద‌రు చ‌నిపోయార‌ని ఆస్ప‌త్రి వర్గాలు శ‌నివారం వెల్ల‌డించాయి. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో రాంచీలో నిషేధాజ్ఞ‌లు జారీ చేసిన పోలీసులు ఇంట‌ర్‌నెట్ సేవ‌ల‌ను కూడా నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement