నదుల అనుసంధాన ప్రాజెక్టులకు 2022-23 బడ్జెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల అమలుకు కేంద్రం సంసిద్ధత తెలిపింది. ఈ బడ్జెట్‌లో ఐదు నదులను అనుసంధానించే ప్రాజెక్టును ప్రతిపాదించారు. వీటికి సంబంధించిన ముసాయిదా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు (డిపిఆర్) ఖరారయ్యాయని, లబ్ధిపొందే రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ప్రాజెక్టు అమలుకు కేంద్రం సహకారం అందించనుంది. 5 డిపిఆర్‌లలో, గోదావరి-కృష్టా, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరీ, దమంగంగ-పింజల్, పర్-తాపి-నర్మద నదుల అనుసంధాన ప్రాజెక్టులున్నాయి. 2020లో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గోదావరి, కృష్ణా, కావేరీ నదీ జలాలను అనుసంధానం చేసేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. గోదావరి నుంచి 47 టీఎంసీల నీటిని కృష్ణా, కావేరీ, పెన్నా బేసిన్లలోని దక్షిణ ప్రాంతాలకు మళ్లించవచ్చు.
• భారతదేశంలో నాల్గవ అతిపెద్ద దైన కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో పుట్టి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. కావేరీ నది కొడగులో పుట్టి కర్ణాటక, తమిళనాడుల గుండా ప్రవహిస్తుంది. ఇక పెన్నా నది చిక్‌బళ్లాపురంలో జన్మించి, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. దేశంలో మూడవ అతిపెద్దనది అయిన గోదావరి కూడా మహారాష్ట్ర నుంచే మొదలవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించి సముద్రంలోకి చేరుతుంది.
• దమగంగ-పింజల్ అనుసంధానం ముంబైనగరానికి తాగునీటి అవసరాలు తీర్చడానికి కీలకం. దామగంగ
బేసిన్ నుంచి మిగులు జలాలను మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఉత్తర మహారాష్ట్ర, ద.గుజరాత్‌లోని పశ్చిమ కనుమలలోని ఏడు రిజర్వాయర్ల నుంచి అదనపు నీటిని మళ్లించడం ద్వారా కచ్, సౌరాష్ట్రలోని కరవు ప్రాంతాలకు నీటిని అందించడం లక్ష్యంగా పర్-తాపి-నర్మట నదుల అనుసంధానాన్ని డిజైన్ చేశారు.
• కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంరూ.44,605 కోట్లను కేటాయించింది. ప్రతిపాదిత
మిగతా ఐదు ప్రాజెక్టులకూ సహాయం అందించేందుకు సిద్ధమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కెన్-బెత్వా ద్వారా 9 లక్షల హెక్టార్లకు సాగునీరు, 62 లక్షలమందికి తాగునీరు, 103 మెగా వాట్ల జలవిద్యుత్, 27మెగావాట్ల సౌర విద్యుత్ ప్రయోజనాలు ఉన్నాయి. ఈప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ. 43వేల కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.1400 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌కు సామాజిక, ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. గతేడాది మార్చి 21న మధ్యప్రదేశ్, యూపీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టుపై సంతకాలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..