గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తీగలను భూమిలోంచి వేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకు వెళ్లింది. ఆ ఆదేశాలను మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఎగిరే పక్షుల్లో బరువైనవి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు. దాదాపు 15 కిలోల బరువుంటాయి ఇవి. పొడవైన మెడతో పాటు పొడవైన కాళ్లుంటాయి. ఈ పక్షులు దాదాపు 1.2 మీటర్ల వరకు పొడవు ఉంటాయి. ఇవి మాంసాహారం, శాఖాహారం రెండూ తింటాయి.
కాగా, ఇవి భారత ఉపఖండంలోని గడ్డి భూములు, పొదల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలో కేవలం భారత ఉపఖండంలోనే ఈ పక్షి జాతి ఉన్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ (డిజర్ట్ నేషనల్ పార్క్), గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పాకిస్తాన్‌లలో ఈ పక్షులను చూడొచ్చు.
ఏ జాబితాల్లో ఎక్కడున్నాయి?
ఐయూసీఎన్ రెడ్ లిస్టులో అంతరించిపోయే జాబితా (క్రిటికల్లీ ఎండేంజర్డ్)లో ఉన్నాయి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతి పక్షులు. ప్రపంచవ్యాప్తంగా బయట (వైల్డ్) 150 వరకే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. సైట్స్ లో అపెండిక్స్ 1లో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో ఉన్నాయి. కాగా, ఈ పక్షులు రాజస్థాన్ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందాయి.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాజస్థాన్ రాష్ట్ర పక్షి. దేశంలో అత్యంత తొందరగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న పక్షి ఇది. దీన్ని గడ్డి భూముల ఫ్లాగ్‌షిప్ జంతువు అంటారు. అంటే గడ్డి భూముల ఆరోగ్యం (హెల్త్) ఎలా ఉందో చెబుతుంటాయి. వేటాడటం, విద్యుత్ సరఫరా వైర్లకు తగిలి ఇవి ఎక్కువగా చనిపోతున్నాయి. ఈ పక్షులుండే ప్రాంతాలు తగ్గిపోతుండం, గడ్డి భూముల్లో వ్యవసాయం పెరుగుతుండటం కూడా వీటి మనుగడుకు కష్టాన్ని తెస్తోంది.