సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో 30 నెలల తర్వాత మొత్తం 34 మంది జడ్జీలతో ఫుల్ బెంచ్ ఏర్పడనున్నది. సీజేఐ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుధాంశు ధులియా, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జంషెడ్ బుర్జోర్ పార్దివాలా పేర్లను సుప్రీంకోర్టు జడ్జీలుగా రెండు రోజుల కిందట సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇవ్వాల (శనివారం) వారి నియామకాలను అధికారికంగా ప్రకటిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం ఆరంభంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వారిద్దరూ ప్రమాణం చేయనున్నారు. దీంతో సుప్రీంకోర్టు 34 మంది న్యాయమూర్తుల పూర్తి సంఖ్యను తిరిగి పొందనున్నది. కాగా, జస్టిస్ పార్దివాలా తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారని, ఆయన రెండేళ్లకు పైగా సీజేఐగా కొనసాగుతారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.
జస్టిస్ జంషెడ్ బుర్జోర్ పార్దివాలా 1990లో గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. 2002లో హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరి 17న గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాఖండ్ నుంచి పదోన్నతి పొందిన రెండో న్యాయమూర్తి అయిన జస్టిస్ ధులియా, జాతీయ అవార్డు గెలుచుకున్న చలనచిత్ర దర్శకుడు, నటుడు తిగ్మాన్షు ధులియా సోదరుడు. ఆయన మూడేళ్లకు పైగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. జస్టిస్ సుధాంశు ధులియా 1986లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో చేరారు. 2000లో ఉత్తరాఖండ్ ఏర్పాటయ్యాక సొంత రాష్ట్రానికి వెళ్లారు. ఉత్తరాఖండ్ హైకోర్టు తొలి చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నిలిచిన జస్టిస్ ధులియా తదుపరి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా సేవలందించారు. 2008 నవంబర్‌లో ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అటుపై అసోం, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.