సుప్రీంకోర్టులో హర్యానా ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా చట్టాన్ని నిలిపివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ నెల 3న ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా స్టే ఆర్డర్ ఇచ్చేందుకు తగిన కారణాలు పేర్కొనలేదని తెలిపింది. అలాగే ఈ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణను నెలలోపు ముగించాలని హైకోర్టుకు సూచించింది. పిటిషన్‌దారులు వాయిదాలను కోరవద్దని పేర్కొంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసే వరకు ఈ కోటా నిబంధన పాటించని ప్రైవేట్ సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హర్యానా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చట్టంపై హైకోర్టు స్టే విధించడాన్ని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్యానా ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ చట్టాని పూర్తిగా పరిశీలించకుండానే కేవలం 90 సెకండ్లలో స్టే విధించిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోవైపు ఉద్యోగుల సంఘం తరుపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital