– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం అని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, ఆత్మీయ సమ్మేళనాల బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాన్నారు. ప్రతీ 10 గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకోవాలని, ఆత్మీయ సమ్మేళనాల కోసం పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలన్నారు. ‘‘ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలి. ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలి. మరింతగా ప్రజల్లోకి పార్టీని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తీసుకెళ్లాలి’’ అని కేసీఆర్ సూచించారు. ‘‘కంటి వెలుగు శిబిరాలతో ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. ఎమ్మెల్యేలు కంటి వెలుగు శిబిరాలను బాధ్యతగా సందర్శించాలి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం నేతలు సిద్ధమై ఉండాలి”అని కేసీఆర్ ఆదేశించారు.
సమ్మిళిత అభివృద్ధిని సాధించిన తెలంగాణ..
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో దూసుకుపోతుంది అని కేసీఆర్ తెలిపారు. స్వయం పాలనను విఫలయత్నంగా చేయాలని ప్రారంభ దశలో సృష్టించిన అనేక అడ్డంకులను దాటుకొని మనం నిలబడ్డాం. రాష్ట్రం సాధించిన పురోగతిని చూసిన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో ప్రజలు మనకు అండగా నిలబడ్డారు. విద్యుత్ కోతలు లేకుండా చేసుకున్నాం. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఇవాళ ప్రతి ఇంటికి తాగునీరు నల్లాల ద్వారా అందుతున్నది. సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. వరి పంట ఉత్పత్తిలోనూ తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. పసి పిల్లలు, ముసలివాళ్ల నుంచి ఆడబిడ్డల వరకు, రైతన్నల నుంచి ఐటీ, పరిశ్రమల వరకు ఇలా ప్రతీ రంగంలో సంక్షేమం, అభివృద్ధి సాధిస్తూ.. తెలంగాణ రాష్ట్రం నేడు సమ్మిళిత అభివృద్ధిని సాధించింది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఐటీ పురోగతిలో బెంగళూరును మించిపోయాం..
విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది అని కేసీఆర్ తెలిపారు. మన పారిశ్రామిక విధానాలను ప్రపంచం మెచ్చుకుంటోంది. దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. బెంగళూరును మించి హైదరాబాద్ ఐటీ రంగంలో పురోగతిని సాధిస్తుంది. ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ గురించి గొప్పగా చెప్పడం మనందరికీ గర్వకారణం అని కేసీఆర్ పేర్కొన్నారు