Tuesday, November 26, 2024

రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావుకు లేఖ రాసిన ఆయన.. రాష్ట్రంలో మొత్తం 1,300 కి.మీ మేర రైల్వే ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వకపోవడం, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టకపోవడం, వివాదాల పరిష్కారంలో చొరవ చూపకపోవడం వల్ల తెలంగాణ రైల్వే పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని తెలిపారు. నిజానికి కొన్నేళ్లుగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.

t

2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,420 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 25% పెంచి రూ.3,048 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. 2014-20 మధ్య కాలంలో కేటాయించిన సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కంటే 3 రెట్లు అధికంగా కేటాయింపులు జరిగాయని వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునికీకరణలో భాగంగా చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రైల్వేలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అందులో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులు, అవసరమున్న చోట మూడవ లైన్ నిర్మాణం, రైల్వే లైన్ల విద్యుద్దీకరణ, రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో జాప్యమవుతున్న ప్రాజెక్టులను లేఖలో ఉదహరించారు.

● కాజీపేట్ – విజయవాడ : 220 కి.మీ.

● కాజీపేట్ – బలార్ష : 201 కి.మీ.

● మణుగూరు – రామగుండం : 200 కి.మీ.

- Advertisement -

● మనోహరాబాద్ – కొత్తపల్లి : 151 కి.మీ.

● కృష్ణా – వికారాబాద్ : 145 కి.మీ.

● బోధన్ – లాతూర్ : 134 కి.మీ.

● కొండపల్లి – కొత్తగూడెం : 82 కి.మీ.

● మునీరాబాద్ – మహబూబ్‌నగర్ : 66 కి.మీ.

● కరీంనగర్ – హసన్‌పర్తి : 62 కి.మీ.

● భద్రాచలం రోడ్ – సత్తుపల్లి : 54 కి.మీ.

● అక్కన్నపేట్ – మెదక్ : 17 కి.మీ.

● కాజీపేట్ – హసన్‌పర్తి రోడ్ : 11 కి.మీ.

ఇప్పటికైనా ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయాలని కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీయార్‌ను కోరారు. అలాగే అవసరమైన చోట భూసేకరణ జరిపి అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భూ వివాదాలున్న చోట పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement