Thursday, November 21, 2024

తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తిని చాటాలే.. సీఎం స‌భ‌కు ల‌క్ష‌లాదిగా త‌ర‌లిరావాలే: మంత్రి ఎర్రబెల్లి

కరువు జిల్లాగా ఉన్న జనగామను సస్య శ్యామలం చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రేపు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, టి.ఆర్.ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం చేయడానికి వస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ కోరారు. ప్రధాని పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో మండిపడుతున్న తెలంగాణ ప్రజలు రేపటి సభకు భారీ ఎత్తున త‌ర‌లిరావాల‌ని కోరారు. ప్రధానికి చరిత్ర తెలువకుండా మాట్లాడితే…ఉద్యమ ఓనమాలు తెలువని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని మాటలు సమర్ధించడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదు అన్నారు.

జనగామ జిల్లాను ఇచ్చి, అన్నివిధాల అభివృద్ధి చేసి జిల్లాకు వస్తున్న సందర్భంగా సీఎం కేసిఆర్‌కు రేపు ఘన స్వాగతం పలుకుతున్నాం. రేపు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, పార్టీ కార్యాలయం ప్రారంభం చేసిన త‌ర్వాత పార్టీ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు తీసుకుంటారు. అనంతరం సీఎం కేసిఆర్ బహిరంగ సభ ఉంటుందని ఎర్ర‌బెల్లి అన్నారు. గతంలో చెరువులు, బావులు ఎండి పోయాయి. జ‌న‌గామ కరువు జిల్లాగా ఉండేది. కానీ మిషన్ భగీరథ, దేవాదుల ద్వారా తాగునీరు, సాగునీరు పుష్కలంగా వస్తోంది అంటే అది సీఎం కేసిఆర్ కృషి ఫలితమేన‌న్నారు.

కేంద్రం ఎంత చిన్న చూపు చూసినా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ అయ్యింది. గుజరాత్ ను మించి పోయింది. సాగునీరు, పంటలు, కరెంట్, ఐటీ, పరిశ్రమల్లో తెలంగాణ నంబర్ వన్. ఇది మేము చెప్పింది కాదు. బీజేపీ కేంద్ర మంత్రులు పార్లమెంట్ లోనే ఇవ‌న్నీ చెప్పారు. రేపు 70, 80 వేల మందితో సభ పెట్టాల‌నుకున్నాం.. కానీ, మోడీ విమర్శల నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇపుడు లక్షా 30 వేల మంది స్వచ్ఛందంగా రానున్న‌ట్టు మాకు స‌మాచారం ఉంది. మహిళలు, రైతులు, యువత, పెన్షనర్లు పెద్ద ఎత్తున్న‌ వస్తున్నారు. అని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. కాగా, ఈసంద‌ర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఇతర నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement