Saturday, November 23, 2024

గంటకు 240 కిలోమీటర్ల వేగం.. హుస్సేన్‌సాగర్‌ తీరంలో రేసు కార్ల సందడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాజధాని హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ప్రారంభమైంది. తొలి రోజు రేసులు విజయవంతంగా ముగిశాయి. రేసుకార్లు సాగరతీరం వెంట రయిమని దూసుకెళ్లాయి. వచ్చే ఏడాది జరగనున్న ఫార్ములా-ఈ రేసుల కోసం ట్రయల్‌గా ఈ రేసులను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లోని మరో రెండు రౌండ్ల రేసులు చెన్నైలో జరగనున్నాయి. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ కోసం ఏర్పాటు చేసిన 2 కిలోమీటర్ల 800 మీటర్ల స్ట్రీట్‌ సర్క్యూట్‌పై స్పోర్ట్స్‌ కార్లు వాయు వేగంతో పరుగులు తీశాయి. రేసులకు ముందు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అనంతరం క్వాలిఫైయింగ్‌ 1,2 రౌండ్ల తర్వాత రేస్‌ వన్‌ స్పిన్ట్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

కేటీఆర్‌ ఐమాక్స్‌ వద్ద ప్రేక్షకులతో నిల్చుని రేసింగ్‌ను వీక్షించారు. ప్రముఖ హీరో నిఖిల్‌ రేసులను వీక్షించిన వారిలో ఉన్నారు. రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొన్నాయి. శనివారం మధ్యాహ్నం 3.10 నుంచి 3.20 గంటల వరకు క్వాలిఫైయింగ్‌-1 డ్రైవర్‌ ఏ బందం, 3.30 నుంచి 3.40 నిమిషాల వరకు క్వాలిఫైయింగ్‌-2బి రేసులు జరిగాయి. సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు మెయిన్‌ రేస్‌ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ కార్‌ రేసుల ప్రిపరేషన్‌లో భాగంగా ట్రయల్‌ రన్‌గా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ నిర్వహిస్తున్నారు.

అయితే ఈ ట్రయల్‌రన్‌ను పెట్రోల్‌ కార్లతోనే నిర్వహించారు. ఈ రేసింగ్‌లో 12 కార్లు 6 బృందాలు, నలుగురు డ్రైవర్లు, మహిళా రేసర్లు పాల్గొన్నారు. రేసర్లలో సగం మంది విదేశాల నుంచి వచ్చినవారేనని నిర్వాహకులు తెలిపారు. పెట్రోల్‌ కార్లు కావడంతో 240కి.మీ స్పీడ్‌తో వెళ్లాయని, ఎలక్ట్రిక్‌ కార్లయితే గరిష్ట వేగం 320 కి.మీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

భారీగా తరలి వచ్చిన సందర్శకులు…
రేసింగ్‌ను వీక్షించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. నిర్వాహకులు కూడా ప్రేక్షకుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 7,500 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ రేసింగ్‌లో మొత్తం 18 మూల మలుపులున్నాయి. ప్రతి మూలమలుపు వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే చికిత్సనందించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్‌, బెంగళూరు, గోవా, చెన్నై, కొచ్చి నుంచి వచ్చిన బృందాలు రేసింగ్‌లో పాల్గొన్నాయి.

సోమవారం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు…
ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌ నుంచి ఐమాక్స్‌, ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌, లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ పార్క్‌ మీదుగా ఈ ట్రాక్‌ తిరిగి ఐమాక్స్‌ దగ్గర ఉన్న గ్యారేజీకి చేరుకుంటుంది. ఖైరతాబాద్‌ కూడలి నుంచి ఫ్లై ఓవర్‌ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు నెక్లెస్‌ రోడ్‌ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ రూట్‌ నుంచి వచ్చే వాహనాలను పీజేఆర్‌ విగ్రహం, షాదాన్‌ కాలేజీ, రవీంద్రభారతి వైపు మళ్లించారు. అలాగే బుద్ధభవన్‌..నల్లగుట్ట జంక్షన్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లించారు. ఈ రూట్లలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, ట్రాఫిక్‌ ఆంక్షలు సోమవారం వరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement