Friday, November 22, 2024

KCR | ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్న‌రు.. కాంగ్రెస్‌పై కేసీఆర్‌ ఫైర్​

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగాయి. బస్‌యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. స‌క్క‌గున్న తెలంగాణ‌లో ఉడుముల్లా సొచ్చి అవ‌స్థ‌లు తెస్తున్న‌ర‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం..

ఆ నాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. ఈ జిల్లాల్లో మంత్రులున్నారు. ఇరిగేషన్‌ మినిస్టర్‌ స్వయంగా ఇక్కడ ఉన్నడు. వీళ్లు దద్దమ్మల్లా పోయి నాగార్జునసాగర్‌ కట్టపై కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి అప్పగించారు. మీరంతా కళ్లారా చూశారు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. 1956 నుంచి ఈ నాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్‌ పార్టీ. 56వ సంవత్సరంలో ఏపీలో కలిపి 58 సంవత్సరాలు అనేక రకాలుగా గోసపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. మొన్న ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చింది. నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారు. రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడుతా అని ఒక మంత్రి మాట్లాడుతున్నడు. చెప్పులు మీకే లేవు రైతులకు కూడా ఉంటయ్‌, వాళ్ల చెప్పులు చాలా బందబస్తుగా ఉంటయ్‌ అని నేను చెప్పిన’ అంటూ గుర్తు చేశారు కేసీఆర్‌.

- Advertisement -

దద్దమ్మలు సాగర్‌ను కేంద్రం చేతుల్లో పెట్టారు..

బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో 18 పంటలకు ఏమాత్రం వెనుకాముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్‌ ఆయకట్టంతా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించాం. ఇవాళ ఈ రోజు ఏమైంది? సాగర్‌లో నీళ్లు ఉండే.. ఇవ్వగలిగే అవకాశం ఉండే. ఈ దద్దమ్మలకు దమ్ములేక.. ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్‌ఎంబీ చేతులో పెట్టి పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినయంటే ఇదే మొదటిసారి. రైతుబంధులో ధగా.. రైతుబీమా ఉంటదో ఊడుతదో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు రెప్పపాటు పోని కరెంటు కటుక బంద్‌చేసినట్లే మాయమైంది. ఎక్కడికి పోయింది కరెంటు ? ఏమైంది కరెంటుకు ? వీళ్లు కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వి పని చేయాల్సిన అవసరం లేకున్నా కేసీఆర్‌ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నరు. కరెంటు ఎందుకు ఆగమవుతుంది’ అంటూ రేవంత్‌ సర్కారును కేసీఆర్‌ ప్రశ్నించారు.

ప్రజలను ఎందుకు బాధపెడుతున్నరు ?

ప్రజలను ఎందుకు బాధలుపెడుతున్నరు? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయచేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? మిషన్‌ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్‌ ఏరియాలో.. మున్సిపల్‌ ఏరియాలో అన్నివర్గాల పేదలకు దొరకాలని ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్‌ ఇచ్చాం. ప్రతి ఇంట్లో నల్లా బిగించి ప్రతి ఇంటికీ నళ్లా నీరందించాం. ఇవాళ మిషన్‌ భగీరథ ఎందుకు నడుపలేకపోతున్నరు. మీ తెలివితక్కువ తనం ఏందీ? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఆ నాడు నీళ్లకోసమే గోస. నాలుగైదు నెలలకే.. కేసీఆర్‌ పక్కకు జరుగంగనే ఎందుకు మాయమై పోయినయ్‌ ? ఎందుకు బాధపడుతున్నరు ? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి..

ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కేసీఆర్‌ను తిట్టడం ఒకటే పని. కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి తప్పా.. పంటలు ఎండబెట్టారు.. రైతుబంధు ఎగొట్టారు.. రైతుబంధు ఐదెకరాలు అని మాట్లాడుతున్నారు. ఏం పోయింది మీ అబ్బసొత్తా ? ఇచ్చేందుకు మీకు ఏం బాధైంది. ప్రభుత్వం సహాయం లేకుండా ప్రపంచంలో ఎక్కడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో తొలిసారిగా రైతులకు అండగా ఉండాలని, అప్పులు తీరాలని బడ్జెట్ నుంచి రూ.15వేలు-రూ.16వేలకోట్లు పెట్టి రైతుబంధు ఇచ్చాం. నేను వస్తుంటే ఆర్జాలబావి దగ్గర బస్సును రైతులు ఆపారు. సార్‌ 20 రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం కొనడం లేదని చెప్పారు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి ? బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోదీ వడ్లు కొన అని మొండి కేస్తే.. ముఖ్యమంత్రితో సహా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేసి.. నరేంద్ర మోదీ మెడలు వంచి.. మా తెలంగాణ పండిస్తున్నది. న్యాయంగా కొనాలి అని చెప్పి కొనుగోలు చేసేలా చేశాం. మద్దతు ధర రూపాయి తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో వేశాం’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement