హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ పోలీస్ శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ అసెంబ్లిdలో చేసిన ప్రకటనకు అనుగుణంగా పోలీస్ శాఖలో అవసరమైన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అనుమతి నిమిత్తం ప్రతిపాదనను ప్రభుత్వానికి పోలీసు శాఖ పంపించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే జరిగితే తాజా ఉద్యోగాల భర్తీలోనూ పోలీస్ శాఖనే ముందు నోటిఫికేషన్ ఇచ్చినట్లవుతుంది. ఇక ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్డ్ (ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో భర్తీ ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
1500లకుపైగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టులను పోలీస్ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నూతన జిల్లాలు, రేంజ్‌లను దృష్టిలో పెట్టుకొని సబ్ఇన్స్పెక్టర్ పోస్టులను ప్రతిపాదించారు. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్ పోస్టులు కాగా, వాటిని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), టీఎస్ఎస్పీ, కమ్యూనికేషన్ విభాగాల్లో నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
పోలీస్ శాఖలో ఇప్పటి వరకు 28వేల పోస్టుల భర్తీ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీస్ శాఖ దాదాపు 28 వేల పోస్టులను భర్తీ చేసింది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ), పోలీస్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ (పీటీవో) విభాగాల్లో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ల భర్తీని మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. తాజాగా 18,334 పోస్టుల్లో 80 శాతం కానిస్టేబుల్, 20 శాతం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, కొత్త సర్కిల్, పోలీస్ స్టేషన్లకు మరింత మంది సిబ్బందిని కేటాయించేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 2018లో 16 వేల పోస్టులను భర్తీ చేసిన నియామకబోర్డు ఆ తర్వాత భారీ ఎత్తున నియామకాల ప్రక్రియను చేపట్టడం రెండవసారి కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..