కర్నాటకలో విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహంతోపాటు.. నాయకులు కూడా యాక్టీవ్ అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీకి పునరుజ్జీవం తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దీంతో చేరికలను ప్రోత్సహించే యత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ఇవ్వాల (సోమవారం) నల్గొండ జిల్లా ముఖ్య నేత, కాంగ్రెస్ సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి ఇంట్లో రహస్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ రెక్కలు విచ్చుకుంటోంది. ఆ గూటిని వదిలివెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ వైపు వచ్చేలా మంతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులు బీజేపీలో చేరడం కంటే కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన వారు కూడా సొంతగూటికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంట్లో పలువురు నేతలు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఆ నేతల్లో ఎవరెవరు ఉన్నారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీకి బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా హాజరైనట్టు సమాచారం. అంతేకాకుండా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి, రీసెంట్ గా బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , మాజీ ఎంపీ గడ్డం వివేక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటూ బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కడియం శ్రీహరి, తీగల కృష్ణారెడ్డి వంటి వారు కూడా ఈ భేటీకి హాజరైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ నుండి తనకు టికెట్ వస్తుందో లేదో అని ఆయన డైలామాలో ఉన్నారు. దీంతో ఆయన కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లడం మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్యతో కడియం శ్రీహరికి అస్సలు పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే. పార్టీ కార్యక్రమాలకు కూడా కడియం శ్రీహరికి ఈ మధ్య ఆహ్వానం అందడం లేదని తెలుస్తోంది. ఇట్లా చాలా కాలం నుండి ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇక.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పార్టీలో తమకు ప్రయారిటీ దక్కడం లేదని బహిరంగంగానే అసంతృప్తిని తెలిపిన సందర్భాలున్నాయి. అయితే.. వీరంతా ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీ మైలేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరోవైపు దీని ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై కచ్చితంగా పడే చాన్స్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో విషయం, ఆఖరి పంచ్ ఏంటంటే.. తామెంతో బలంగా ఉన్నామని, తెలంగాణలో అధికారంలోకి వస్తామని గప్పాలు కొట్టుకుంటున్న బీజేపీకి ఇది మరింత షాక్ కలిగించే విషయమని, నష్టం పెద్దగానే ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.