Friday, November 15, 2024

ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణ‌లో 40 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో వారం, పది రోజులుగా జనాన్ని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగాలులు వీస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు భగ భగమండిపోతున్నాడు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌ మూడో వారం నుంచి మే మాసంలో నమోదయ్యేవి. కాని ఈ సారి నెల రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలను రాష్ట్ర ప్రజలు గతంలో చూడలేదు.

దక్షిణ కశ్మీరంగా పేరుగాంచిన ఆదిలాబాద్‌ జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌, ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలు తీవ్రంగా వీస్తున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. ఎండలు మండిపోతుండటంతో మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం బెంబేళెత్తిపోతున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే రోడ్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దాదాపు నిర్మానుషంగా మారుతున్నాయి. వేసవి ఎండలను తట్టుకునేలా చలివేంద్రాలు, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో వడదెబ్బ తగిలి ముగ్గురు మృతిచెందారు. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే వడదెబ్బకు ఇద్దరు ప్రాణాలు విడిచారు. జిల్లాలోని జైనద్‌లో రైతు విఠల్‌ పొలం పనికి వెళ్లి ఎండలో పనిచేశాడు. డీహ్రైడ్రేషన్‌ కు లోనై స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. తిర్యాని మండలంలోనూ వడ దెబ్బ తగిలి ఓ ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ప్రాణాలు విడిచాడు. రాష్ట్రంలో రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ను ప్రకటించింది. మరో మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదముందని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రాకపోవటమే మేలని ఇటు వాతావరణశాఖ అటు వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలను హెచ్చరించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement