Friday, November 22, 2024

Crime Mystery | దోస్తు ప్రాణం తీసిన దొంగ సొత్తు.. పంప‌కాల్లో తేడాతో మ‌ర్డ‌ర్‌

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): చోరీ చేసిన సొత్తును పంచుకొనే పంపకాల్లో ఇద్ద‌రి మధ్య లొల్లి జ‌రిగింది. ఈ పంచాయితీ కాస్త తేడాకొట్ట‌డంతో ఫ్రెండ్ అని కూడ చూడకుండా తన మిత్రుడునే రాళ్లతో కొట్టి నిండుప్రాణం తీసిన ఘటన వరంగల్ జిల్లాలో జ‌రిగింది. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ తెలిపిన వివ‌రాల ప్రకారం.. వారిద్దరూ చిల్లర దొంగలు. 7 మీటర్ల టెలిఫోన్ వైరును దొంగిలించారు. అందులో నుండి వచ్చే కాఫర్ వైరు అమ్ముకొని, వచ్చే సొమ్మును పంచుకొనే విషయంలో ఇద్ద‌రి మధ్య గొడవ జరిగింది. మొత్తం సొమ్ము తనకే కావాలని చోరీ చేసేందుకు పిలిచిన గోపతి శివ మెలికపెట్టాడు. చోరీ సొత్తును కలిసి షేర్ చేసుకొందామని చెప్పి.. ఇప్పుడు మాట మారిస్తే ఎట్లా అని శివను మృతుడు జన్ను యుగేందర్ నిలదీశాడు.

ఎలాగూ వచ్చావు కనుక మందు పార్టీనిస్తాన‌ని ఆఫర్ చేశాడు శివ‌. కానీ ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవముదిరింది. కోపోద్రిక్తుడైన శివ రాళ్లతో యుగేందర్ మర్మాంగాలపై కొట్టాడు. కిందపడి గిలాగిలా కొట్టుకుంటున్న యుగేందర్ పై దాడి చేసి కాళ్లతో తన్నాడు. తగులరాని చోట బలమైన గాయాల‌వ‌డంతో యుగేందర్ స్పృహ కోల్పోయాడు. చలనం లేకుండా పడిపోయిన యుగేందర్ ను మిత్రుడు శివ తనపై నేరం పడుతుందని ఆలోచించి, పథకం వేశాడు. తానే యుగేందర్ ను చికిత్స కోసం వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో చేర్పించాడు.

ఆపైన తానే మృతుని భార్య జన్ను బేబీకి ఫోన్ చేసి ప్రమాదానికి గురైన యుగేందర్ ను హాస్పిటల్ లో చేర్పించిన్నట్టు చెప్పాడు. ఈ విషయంపై తర్జనభర్జనలు పడ్డ మృతుడి భార్య బేబీ భర్త మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ మట్వాడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మట్వాడా ఇన్స్ పెక్టర్ వెంకటేశ్వర్లు తనదైన శైలిలో విచారణ జ‌రిపి, మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఈనెల 3న, జరిగిన మర్డర్ బాగోతాన్ని వరంగల్ ఎసిపి బోనాల కిషన్ ఇవ్వాల (బుధవారం) మీడియాకు తెలిపారు. బ్యాంక్ కాలనీ లోని 7మీటర్ల టెలిఫోన్ వైరు కోసం ఫ్రెండ్ అని కూడ చూడకుండ దారుణంగా దాడి చేసి హతమార్చడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement