Saturday, November 23, 2024

అక్క‌డ లీట‌ర్ పెట్రోల్ రూపాయి 89పైస‌లే…

గ‌త 20 రోజుల‌కు పైగా ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా యుద్ధం కొన‌సాగుతోంది. అయితే ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం తరువాత పలు నిత్యవసరాలు, ఇతర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.


మన దేశంలో పెట్రోల్ ధరలు రూ.100కి పైగానే ఉన్నాయి. మరి ఇతర దేశాల్లో ఎలా ఉన్నాయంటే… పాకిస్తాన్ లో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.837 డాలర్లు (సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు (రూ. 84) వద్ద ఉంది. బంగ్లాదేశ్ లో 1.035 డాలర్లు (రూ.78.43) ఉంటే నేపాల్ లో $1.226 (రూ.93) గా ఉంది. ఇక వెనిజులా దేశంలో ఒక లీటర్ పెట్రోల్ 0.025 డాలర్లు(రూ.1.89) గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర 0.032 డాలర్లు (రూ.2.43)గా ఉంది. ఇతర దేశాల్లో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం హాంగ్ కాంగ్. ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ 2.879 డాలర్లు (రూ.218)గా ఉంది. ఆ తర్వాత నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లిచెన్ స్టెయిన్, జర్మనీ వంటి దేశాల్లో ఇంధనం ధర లీటరుకు రూ.200కు పైగా ఉంది. అయితే మ‌న దేశంలో హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అలాగే పెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్ కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడంతో వచ్చే కాలంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement