కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 66 శాతం పోలింగ్ కాగా, పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పలు బూత్‌లలో ఓటర్లు క్యూలైన్‌లలో నిలబడి ఉన్నారు. దీంతో క్యూ లైన్‌లలో ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరినీ లైన్‌లలోకి రానీయలేదు.
కాగా, పోలింగ్ సమయం ముగిసిన క్యూలైన్‌లలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. అయితే ఆ పెరిగే పోలింగ్ శాతం ఎంత ఉంటుందనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటకలో 72.13 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి కూడా అంతకంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందా లేదా..? అనే విషయం మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది.