Wednesday, November 20, 2024

Spl Story: పోలీస్​ సిస్టమ్​కి పెద్ద దెబ్బ.. మహిళల రిక్రూట్​మెంట్​ లేదు, సీసీ కెమెరాల్లేవ్​!

భద్రత పరంగా బోర్డర్​లో ఆర్మీ ఎంత పటిష్టంగా ఉంటే దేశం అంత సేఫ్​ అని భావిస్తారు. అంతేకాకుండా ఇంటర్నల్​గా దేశంలోని పోలీసు వ్యవస్థ కూడా అంతే పటిష్టంగా ఉంటేనే శాంతి, భద్రతల పరిరక్షణ బాగుంటుందన్నది వాస్తవం. అయితే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు పోలీసు వ్యవస్థని దెబ్బతీసేలా ఉంటున్నాయి. దీనికి ఈ మధ్య కాలంలో ఇండియన్​ జస్టిస్​ సర్వే రిపోర్టే ప్రధాన ఆధారంగా చెప్పుకోవచ్చు. ఈ (IJP) సర్వే నివేదిక ప్రకారం.. దేశంలోని పోలీస్​ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, స్టేషన్లలో సరైన వసతుల లేకపోవడంతోపాటు.. మహిళా ఉద్యోగులు, మహిళా కానిస్టేబుళ్ల రిక్రూట్​మెంట్ కూడా సక్రమంగా చేపట్టడం లేదని తెలుస్తోంది. అయితే, ఒక్క తెలంగాణలోనే అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని ఈ సర్వే నివేదిక ద్వారా తెలుస్తోంది.

‌– డిజిటల్​ మీడియా విభాగం, ఆంధ్రప్రభ

ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (IJR) ప్రకారం.. రాష్ట్రాలు, UTలలోని మొత్తం పోలీసు ఫోర్స్ లో మహిళలు కేవలం 10.5 శాతం మాత్రమే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మూడు పోలీస్ స్టేషన్‌లకు ఒక్క దానిలో మాత్రమే CCTV  ఏర్పాటు చేశారు. జనవరి 2021 నాటికి దేశంలోని 41శాతం పోలీస్ స్టేషన్‌లు ఇంకా మహిళల కోసం హెల్ప్ డెస్క్ లను ప్రారంభించలేదు. 14 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే తమ జిల్లాలన్నింటిలో సైబర్ సెల్‌ ఏర్పాటు చేశారని నివేదిక తెలియజేస్తోంది.

ఇండియన్​ జస్టిస్​ రిపోర్ట్​ (IJR) డేటా ప్రకారం.. చాలా వరకు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విడుదల చేసిన అధికారిక “డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్” (DoPO) 2021 నుండి దీన్ని తీసుకున్నారు. జనవరి 2020, జనవరి 2021 మధ్య.. 2016 నుండి ఐదు సంవత్సరాల కాలం నుంచి మెరుగుదల.. లోటులను ఈ నివేదికలో హైలైట్ చేశారు.

- Advertisement -

ప్రతి స్థాయి పోలీసింగ్‌లో నియామక లక్ష్యాలు, మహిళా నియామకాలు, SC/ST/OBCలతో సహా కీలక సూచికల విషయంలో చాలా రాష్ట్రాలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. దీంతోపాటు పోలీసు బలగాల ఆధునీకరణకు కేటాయించిన.. ఖర్చు చేసిన నిధులు కూడా వాటి వాటా ప్రకారం తగ్గినట్లు తెలుస్తోంది.

మహిళా పోలీసు అధికారులు..

పోలీసు బలగాలలో మహిళలకు 30% రిజర్వేషన్ ఉన్నప్పటికీ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం ఫోర్స్ లో మహిళలు 10.5 శాతం మాత్రమే ఉన్నారు. IJR నివేదిక ప్రకారం.. 11 రాష్ట్రాలు/UTలలో ఇది 5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంది. ప్రస్తుత పెరుగుదల రేటు ప్రకారం పోలీసు స్టేషన్లలో మహిళలకున్న 33% లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా 33 సంవత్సరాలు పడుతుంది.

తమిళనాడు (19.4%), బీహార్ (17.4%) గుజరాత్ (16%) అత్యధిక మహిళా పోలీసు అధికారులను కలిగి ఉండగా.. ఈ రాష్ట్రాలు కూడా వారి పేర్కొన్న 30%, 38% మరియు 33% రిజర్వేషన్‌లకు అనుగుణంగా లేవు. 6.3% మహిళలతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప శాతం, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లు 6.6% చొప్పున ఉన్నాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసుల్లో 12.4% మంది మహిళలతో ప్రస్తుత రిక్రూట్‌మెంట్ రేటు ప్రకారం, అవసరమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి 31 సంవత్సరాలు పడుతుంది.

CCTVలు..

నిర్భయ ఫండ్ ప్రాజెక్ట్ ల కింద కేటాయింపులు, అనుమతుల రూపంలో ప్రోత్సాహం ఉన్నప్పటికీ.. దేశంలోని 17, 233 పోలీస్ స్టేషన్‌లలో మూడింటిలో ఒకదానికి ఒక్క సీసీ కెమెరా లేదు. మూడు రాష్ట్రాలు/యూటీలు (ఒడిశా, తెలంగాణ మరియు పుదుచ్చేరి) మాత్రమే అన్ని పోలీస్ స్టేషన్‌లలో కనీసం ఒక CCTVని కలిగి ఉన్నాయి. ఇక నాలుగు రాష్ట్రాలు/యూటీలు (రాజస్థాన్, మణిపూర్, లడఖ్, లక్షద్వీప్) 1% కంటే తక్కువ పోలీస్ స్టేషన్‌లలో CCTV కెమెరాలు ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అంతేకాకుండా 2019-20లో ఆధునికీకరణకు నిధుల కేటాయింపు తగ్గిందని ఇండియా జస్టిస్ రిపోర్ట్ కూడా పేర్కొంది. అయితే.. మంజూరైన నిధుల వాస్తవ వినియోగం 2018-19లో 41.4% నుండి 2019-20 సంవత్సరంలో 54%కి పెరిగిందని విశ్లేషణ చూపుతోంది. “2019-20లో రాష్ట్ర వినియోగం కోసం BPR&D నుండి తాజా సవరించిన గణాంకాల ప్రకారం కేటాయించిన నిధులలో 100% వినియోగించిన ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్” అని IJR పేర్కొంది. 16 రాష్ట్రాలు/యూటీలు ఆమోదించబడిన నిధులలో 40% కంటే తక్కువ ఉపయోగించగా  ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలు వరుసగా 9.6% , 12.5% ​​నిధులను మాత్రమే ఉపయోగించుకోగలిగాయి.

సైబర్ సెల్

భారతదేశంలోని 746 జిల్లాల్లో 63% మాత్రమే సైబర్ సెల్‌ని కలిగి ఉన్నాయి. ప్రతి జిల్లాకు అటువంటి సెల్‌ను రూపొందించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ.. ఫిబ్రవరి 2022లో రాజ్యసభలో సమర్పించిన నివేదిక నుండి సేకరించిన డేటా ప్రకారం.. గురువారం విడుదల చేసిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఆన్ పోలీస్‌లో హైలైట్ చేయబడింది. పంజాబ్, మిజోరాం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు, ఫిబ్రవరి 2022 నాటికి ఏ జిల్లాలోనూ సైబర్ సెల్‌లను కలిగి లేవు.

ఖాళీలు

2010లో జాతీయ మొత్తం ఖాళీ స్థాయి 24.3%గా ఉంది. ఆఫీసర్ ఖాళీలు 24.1% , కానిస్టేబులరీ 27.2% ఉన్నాయి.  ఇక.. 2020లో మొత్తం ఖాళీలు 21.4%, ఆఫీసర్ ఖాళీలు 32.2% మరియు కానిస్టేబులరీ 20. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలలో 1/4 వంతు కంటే ఎక్కువ కానిస్టేబుల్, ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఖాళీలు బీహార్‌లో అత్యధికంగా (41.8%), ఉత్తరాఖండ్‌లో అత్యల్పంగా (6.8%) ఉన్నాయి.

మహిళలు హెల్ప్ డెస్క్

అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్ లు ఉన్న ఏకైక రాష్ట్రం త్రిపుర కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో ఏవీ లేవు. తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 90శాతానికి పైగా పోలీస్ స్టేషన్లలో మహిళల కోసం హెల్ప్ డెస్క్ లు ఉన్నాయి. 1 జనవరి 2021 నాటికి 41% పోలీస్ స్టేషన్‌లలో మహిళా హెల్ప్ డెస్క్ లు లేవు. పట్టణ ప్రాంతాలు ఈ విధానాన్ని మెరుగ్గా అమలు చేస్తున్నాయని, 4,905 పట్టణ పోలీస్ స్టేషన్లలో 3700 మహిళా హెల్ప్ డెస్క్ లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 9,264 పోలీస్ స్టేషన్లలో 5,754 మాత్రమే మహిళా హెల్ప్ డెస్క్ లను కలిగి ఉన్నాయి.

SC, ST, OBC రిక్రూట్‌మెంట్

షెడ్యూల్డ్ కులాల శాతం 12.6% (2010) నుండి 15.2% (2020)కి పెరిగింది. అయితే షెడ్యూల్డ్ తెగల వాటాలో పెరుగుదల తక్కువగా ఉంది. 2010లో 10.6% నుండి 2020లో 11.7%కి చేరుకుంది. పోలీసుల్లో OBCల ప్రాతినిధ్యం 2010లో 20.8% నుండి 2020 నాటికి 28.8%కి పెరిగింది. నివేదిక ప్రకారం.. 2020లో కర్నాటక మినహా ఏ రాష్ట్రం లేదా UT దాని చట్టబద్ధమైన రిజర్వేషన్ కోటాను మీట్​ కాలేదు. చాలా పోలీసు స్టేషన్లలో SC, ST , OBCలు తక్కువ మందే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement