తెలంగాణ సంస్కరణ పథం.. దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు, మరెన్నో విప్లవాత్మక సంస్కరణలు అని చెప్పారు. ప్రజలే కేంద్రంగా సాగిన తెలంగాణ సంస్కరణల పథం యావత్ భారతావనికే ఓ పరిపాలనా పాఠమని తెలిపారు.
ప్రతి నిర్ణయం పారదర్శకమని, ప్రతి మలుపులో జవాబుదారితనమి, ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యం అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేసీఆర్ ఈ దశాబ్ద కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు.. వచ్చే శతాబ్దికీ ఆచరించాల్సిన అడుగుజాడలని చెప్పారు. సంక్షేమ ఫలాలే కాదు, సంస్కరణల ఫలాలు కూడా ప్రజలందరికీ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మాత్రమే సొంతమని పేర్కొన్నారు. మీకు పాలన చేతకాదు అని అన్నోళ్లే.. మన పాలనా సంస్కరణలు చూసి మనసారా మెచ్చుకుంటున్న అరుదైన తరుణం ఇదని, తమ గుండెలనిండా దీవిస్తున్న అపూర్వమైన సందర్భమని వెల్లడించారు. విద్యుత్ దీపాలతోనే కాదు.. విద్యతో కూడా ప్రతి ఇంట్లో వెలుగులు నింపొచ్చన్న విప్లవాత్మకమైన సంస్కరణలు, విద్యారంగాన్ని తీర్చిదిద్దే వినూత్న ఆలోచనలని మంత్రి కేటీఆర్ చెప్పారు.