మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టబోతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది.
రేపు (నవంబర్ 10, బుధవారం) ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అసెంబ్లీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది ఏడోసారి. ఇప్పటివరకు ఆరు సార్లు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో… ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత… 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ సీటింగ్ వైపు కూర్చున్నారు. రేపటి ఈటల ప్రమాణస్వీకారాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని రాష్ట్ర బీజేపీ, ఈటల మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.