ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కొన్ని దేశాల్లో ఇంకా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో కొంత అదుపులో ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే భారత్ లో తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి.. దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి పెరిగాయి. శనివారం 3962 పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 4270కి చేరింది. ఇది నిన్నటికంటే 7.8 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,76,817కి చేరాయి. ఇందులో 4,26,28,073 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,692 మంది మరణించగా, 24,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15 మంది మృతిచెందగా, 2619 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 1,465 కేసులు ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో 1375, ఢిల్లీలో 405, కర్ణాటకలో 222, హర్యానాలో 144 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉన్నాయని, 98.73 శాతం మంది కోలుకున్నారని, 1.22 మంది మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,94,09,46,157 కరోనా డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. శనివారం ఒక్కరోజే 11,92,427 మందికి వ్యాక్సినేషన్ చేశామని, 4,13,699 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రకటించింది.