Tuesday, November 26, 2024

Big Story | తయారీ రంగమే కీలకం.. పెట్టుబడులను ఆకర్షించే తారకమంత్రం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ నుంచి ఇప్పటికే ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతుల బూమ్‌ కొనసాగుతున్నందున ఇక నుంచి తయారీ రంగానికి సంబంధించి వస్తువుల ఉత్పత్తుల పరిమాణం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి చిన్న, మధ్యతరగతి, కుటీర పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈలు)కు వీలైనన్ని ఎక్కువ ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్స్‌పోర్ట్‌ జోన్స్‌ ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. రాష్ట్ర జీఎస్డీపీలో సేవా రంగానికి ధీటుగా తయారీ రంగాన్ని పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించి, వాటి ఉత్పత్తులకు మార్కెట్‌విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మార్కెట్‌ విస్తరణ జరగాలంటే చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాలు కల్పించడం తప్ప ఇతరత్రా ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏయే జిల్లాలో ఏయే వస్తువులు ఎక్కువగా తయారవుతున్నాయో వాటికి ఏ విధమైన విలువ జోడింపు చేస్తే ఎగుమతుల మార్కెట్‌ ఏర్పడుతుందన్నదానిపై పరిశ్రమల శాఖలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాల స్థాయిలో కలెక్టర్‌తో పాటు పరిశ్రమల శాఖ అధికారులు కూడా ఇప్పటికే అధ్యయనం ప్రారంభించి నివేదికలు రెడీ చేశారు.

ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత అన్ని జిల్లాల్లో సుమారు రూ.100 కోట్ల ఖర్చుతో ఎగుమతులకు ప్రత్యేక ఎక్స్‌పోర్ట్‌ జోన్‌లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. ఈ జోన్‌లలో ఆయా జిల్లాల్లో తయారయ్యే ఉత్పత్లుకు విలువ జోడింపు చేయడానికి అవసరమైన శుద్ధి, ఫినిషింగ్‌ చేసి విదేశాల్లో డిమాండ్‌ ఏర్పడేందుకు, అక్కడి ప్రమాణాలు అందుకునేలా తుది మెరుగులు దిద్దనున్నారు.

- Advertisement -

ఎగుమతుల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానం లక్ష్యం…
దేశం నుంచి ఎగుమతయ్యే వస్తు,సేవల ఉత్పత్తుల్లో తెలంగాణ ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. అయితే ఈ స్థానంలో నిలదొక్కుకునేందుకు సర్వీసు రంగంలోని ఐటీ సెక్టార్‌ ఉత్పత్తులే ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. తయారీ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు కూడా ఈ విషయంలో తోడైతే ఎగుమతుల్లో దేశంలోనే రాష్ట్రం నెంబర్‌వన్‌ అయ్యే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎగుమతుల జోన్‌ల ఏర్పాటుకు అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నలిగిపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఎగుమతులతో ఊతం…
రాష్ట్ర జీఎస్‌డీపీలో సర్వీసెస్‌ రంగంతో పోలిస్తే తయారీ రంగం వాటా అతి స్వల్పంగా ఉన్నప్పటికీ ఆ రంగంలోని ఉత్పత్తిలో ఎక్కువ భాగం చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి వస్తున్నదే. రాష్ట్రంలో సుమారు 25 లక్షల వరకు ఉన్న ఎంఎస్‌ఎంఈలను కరోనా సృష్టించిన సంక్షోభంలో నుంచి బయట పడేయాలంటే వాటికి ప్రభుత్వం వైపు నుంచి మార్కెటింగ్‌ సహకారం అందించడమే పరిష్కారమని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎంఎస్‌ఎంఈలకు చేయూతనందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌పోర్ట్‌ జోన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఎక్స్‌పోర్ట్‌జోన్‌లలోని మౌలిక సదుపాయాలతో పాటు అక్కడ అందే మార్గనిర్దేశంతో ఎంఎస్‌ఎంఈలు తమ విక్రయాలను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో ఉన్న చేనేత, వివిధ రకాల అరుదైన హస్తకళలకు సంబంధించిన ఉత్పత్తిదారులకు ఈ ఎక్స్‌పోర్ట్‌ జోన్‌ల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఎక్స్‌పోర్ట్‌ జోన్‌లలో కస్టమ్స్‌ క్లియరెన్స్‌కు ఒక కౌంటర్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో వస్తువుల కన్‌సైన్‌మెంట్‌లకు పోర్టులలో ప్రత్యేకంగా తనిఖీలు అవసరం లేకుండా పోతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎక్స్‌పోర్ట్‌ జోన్‌లతో తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనాలుంటాయని భావిస్తున్నారు.

తయారీ రంగానికి పెట్టుబడులకు ఊతం…
ఐటీ, ఐటీయేతర తదితర సేవల రంగంలో రాష్ట్రంలోకి విశేషంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రభుత్వం తాజాగా తయారీ రంగంలోకి పెట్టుబడులు రాబట్టే పనిలో పడింది. సేవా రంగంలో కంటే తయారీ రంగంలో ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభించనుండడంతో ప్రభుత్వం ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌(నివ్జ్‌ు) హోదా పొందిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని పారిశ్రామిక పార్కుపై పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇటీవలే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీ ట్రైటాన్‌ ఈవీ ఈ పారిశ్రామిక పార్కులో రూ.2000 కోట్లతో విద్యుత్‌ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంతో పాటు పలు పేరొందిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు, టెక్స్‌టైల్‌ కంపెనీలు, కెమికల్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పార్కులో కల్పించిన మౌలిక సదుపాయాలతో పాటు జహీరాబాద్‌కు ఉన్న కనెక్టివిటీ సౌకర్యాలు వెరసి కంపెనీలకు గ్లోబల్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఏర్పడుతుందని, దీంతో అనేక కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లు ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ పారిశ్రామిక పార్కుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకురావడంతో పాటు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే దిశగా పరిశ్రమల శాఖ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. 13వేల500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధిచేయతలపెట్టిన ఈ ఇండస్ట్రియల్‌ పార్కుకు సంబంధించి ఇప్పటికి కేవలం 2900 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం సేకరించింది.

మిగిలిన భూమిని త్వరలోనే సేకరిస్తామన్న ధీమాను అధికారులు వ్యక్తంచేస్తున్నారు. జహీరాబాద్‌కు ఉన్న రైలు, రోడ్డు, విమానయాన మార్గాల్లో ఉన్న అనుసంధానంతో పెట్టుబడులు పెట్టే వారికి ముడిసరుకు రవాణాతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సులువవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే కాక ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు రకాల పరిశ్రమలు ఉండడంతో నైపుణ్యవంతమైన ఉద్యోగులకు కూడా కొరత ఉండదని చెబుతున్నారు. ఇవన్నీ ఈ పార్కుకు కలిసొచ్చే అంశాలని వారు వివరిస్తున్నారు. అయితే రాజధాని హైదరాబాద్‌ సమీపంలోని ఫార్మాసిటీతో పోలిస్తే జహీరాబాద్‌ నివ్జ్‌ులో కంపెనీలకు భూమి 50 శాతం తక్కువ రేటుకే లభిస్తోంది. ఈ పారిశ్రామిక వాడ ఉన్న ప్రాంతం గ్రామీణ ప్రాంతం కావడమే ఇందుకు కారణం. దీంతో ఇక్కడ కంపెనీలకుపరిశ్రమ ఏర్పాటు ఖర్చు తగ్గనుంది. ఇంతే కాకుండా ఇక్కడ పరిశ్రమలతో పాటు పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కేంద్రాలు ఏర్పాటు చేసే వారు చేసే ఆవిష్కరణలకు సంబంధించి పేటెంట్‌ దాఖలు చేసేందుకు అయ్యే ఖర్చులో 50 శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వమే భరించనుండడం ప్రశంసించదగ్గదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement