హైదరాబాద్: ‘‘దేశంలోని 132 కోట్ల మంది ప్రజల భద్రతనే కాదు.. భారతదేశపు 32 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం బాధ్యత కూడా పోలీసులదే అన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఈ దేశపు చివరి అడుగు వరకూ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇవాళ ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది.
ఈ పాసింగ్ ఔట్ పరేడ్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న వాటి పైనే కాక, బోర్డర్ మేనేజ్మెంట్ బాధ్యత కూడా మీపై ఉంటుందని వారికి సూచించారు. భారత దేశపు 15 వేల కిలోమీటర్ల భూమిపై నిరంతరం చైనా, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌తో సమస్యలు వస్తూనే ఉన్నాయి. శాంతి భద్రతలు సక్రమంగా లేని దేశాలు అభివృద్ధి చెందలేవు. ప్రజాస్వామ్యం.. నాయకుల చేతిలో కాదు ఆఫీసర్ల సుపరిపాలనలో ఉంటుంది” అంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ట్రైనీ ఐపీఎస్‌లకు మార్గనిర్దేశం చేశారు.
నేను కూడా ఇదే అకాడమీ నుంచే వచ్చా..
దేశ భద్రతలో పోలీస్ సర్వీస్ వెన్నెముక లాంటిదని అజిత్ దోవల్ అన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఐపీఎస్‌లకు ఆ ట్యాగ్ లైన్ ఉంటుందన్నారు. 52 సంవత్సరాల క్రితం తాను కూడా ఇదే అకాడమీ నుంచి ఐపీఎస్‌గా వచ్చానని చెప్పారు. తనను ఐపీఎస్‌గా తీర్చిదిద్దిన అకాడమీ ఫ్యాకల్టీకి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ అకాడమీ 1948 నుంచి దేశానికి 5,700 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఇచ్చిందన్నారు.
దేశవ్యాప్తంగా 21 లక్షల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, 35 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది అమరులయ్యారని అజిత్ దోవల్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ శతాబ్ది ఉత్సవం నాటికి భారత్ ఇంకా ఎంతో ముందు ఉంటుందని, చాలా డిఫరెంట్‌గా ఇండియాను చూడబోతున్నామని దోవల్ చెప్పారు. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో సాధించామని, మనం చేస్తున్న ప్రతి సేవ దేశం కోసమేనని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
కాగా, అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 73వ ట్రైనీ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ ఈ రోజు ఉదయం జరిగింది. ఈ బ్యాచ్‌లో శిక్షణ పొందిన 149 మందిలో నుంచి తెలంగాణకు నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను, ఏపీకి ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించారు. ఈ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఐపీఎస్‌లను లీడ్ చేసే పరేడ్ కమాండర్‌గా మహిళా ట్రైనీ ఐపీఎస్ దర్పన్ అహ్లూవాలియా లీడ్ చేశారు. ఇలా మహిళా కమాండర్ పరేడ్‌ను ముందుండి నడిపించడం వరుసగా మూడోసారి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily